ఐఏఎస్‌ల అంతిమ లక్ష్యం అదే : ఏపీ సీఎస్‌

20 Apr, 2019 12:38 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాలసీలు డీల్‌ చేయాల్సివచ్చినప్పుడు అది వ్యక్తిగత లాభం కోసమా.. లేక సమాజ ప్రయోజనం కోసమా అని ఐఏఎస్‌లు గుర్తించగలగాలని, మానవత్వం, దేశ సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణే అంతిమ లక్ష్యం కావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శనివారం సెక్రటేరియేట్‌లో ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెక్రటేరియేట్‌ అనేది సివిల్‌ సర్వీస్‌ అధికారుల హబ్‌ అని.. అందుకే ఇక్కడ సమావేశం జరపాలని కోరినట్టు తెలిపారు.

చీఫ్‌ సెక్రటరీగా మిగిలిన ఉన్నతాధికారులకు రోల్‌మోడల్‌గా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. నిజాయితీగా, హుందాగా ఉండటం తన బాధ్యత అని అన్నారు. సివిల్‌ సర్వీస్‌ అధికారుల జీవితం క్రికెట్‌ మ్యాచ్‌ లాంటిదని.. ఒక్క బాల్‌ సరిగ్గా ఆడకపోయినా ఔట్‌ కావాల్సిందేనని పేర్కొన్నారు. రెచ్చగొట్టినా.. సహనంతో ఉండి ముందుకు వెళ్లాల్సిందేనన్నారు. అవతలి వాళ్లు రెచ్చగొట్టారు కదా అని టెంపర్‌ కోల్పోయి ప్రతివ్యాఖ్యలు చేయడం వల్ల ఉద్యోగం కోల్పోయిన అధికారులు కూడా తనకు తెలుసునన్నారు. ఒక్కసారి సివిల్‌ సర్వీస్‌లోకి రావాలని అనుకున్నాక ఇది లాంగ్‌టర్మ్‌ గేమ్‌ లాంటిదని గుర్తించాలని అన్నారు. బ్లాక్‌2లో అయినా బ్లాక్‌ 1లో ఉద్యోగం అయినా ఒక్కటే అని గుర్తించాలని అన్నారు.

>
మరిన్ని వార్తలు