ఉప ముఖ్యమంత్రి కేఈకి తీవ్ర అవమానం

1 Feb, 2019 02:05 IST|Sakshi

తన శాఖకు సంబంధించిన టీటీడీ నుంచే చేదు అనుభవం

రాజధానిలో శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి పిలవనివైనం 

కేఈని పట్టించుకోకుండానే కార్యక్రమాన్ని  ముగించిన సీఎం చంద్రబాబు

టీడీపీలో బీసీల దుస్థితికి అద్దంపడుతోందంటూ విమర్శలు 

తనకు జరిగిన అవమానంపై కేఈ ఆవేదన

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తికి రాజధాని ప్రాంతంలో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తీరని అవమానం జరిగింది. స్వయానా తన శాఖ పరిధిలో జరుగుతున్న కార్యక్రమానికి కూడా ఆయనకు సరైన ఆహ్వానం లేకుండా చేశారు. టీడీపీలో సీనియర్‌నేత, బీసీవర్గానికి చెందిన కేఈని కనీసం పట్టించుకోకుండానే గురువారం శ్రీవారి ఆలయ  భూకర్షణ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముగించారు. దీనిపై బీసీ వర్గాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్‌ బీసీ నాయకుడికే తెలుగుదేశం పార్టీలో కనీస విలువ దక్కడం లేదని, ఇక సామాన్య బీసీ నేతలకు విలువేముంటుందని దుయ్యబడుతున్నారు. రాజధాని నిర్మాణంలోనూ, రెవెన్యూ బదిలీలల్లోనూ కేఈని పక్కన పెట్టడంపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అడుగడుగునా బీసీలను మోసం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని మండిపడుతున్నారు. పార్టీలో బీసీ నేతల పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందంటూ విమర్శలు గుప్పించారు. తనకు జరిగిన అవమానంపై కేఈ కృష్ణమూర్తి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఉన్నతాధికారులను ప్రభుత్వ పెద్దలు వెనుకేసుకొస్తుండటం వల్లనే తనలాంటి సీనియర్లకు సైతం కనీస విలువ కూడా ఇవ్వడం లేదని ఆయన బాధ వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ప్రభుత్వం రాజధాని ప్రాంతమైన వెంకటపాలెం సమీపంలో టీటీడీకి 25 ఎకరాలను ఎకరా రూ.25 లక్షల చొప్పున విక్రయించింది. ఈ స్థలంలో ఆలయం నిర్మాణానికి టీటీడీ అధికారులు భూకర్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మరికొందరు టీడీపీ ముఖ్యులను ఉన్నతాధికారులు స్వయంగా ఆహ్వానించారు. దేవదాయ శాఖ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న సీనియర్‌ నేత కేఈ కృష్ణమూర్తిని మాత్రం పట్టించుకోలేదు. సాధారణ నాయకులకు పంపిన రీతిలో కిందిస్థాయి అధికారితో ఒక ఆహ్వానపత్రాన్ని పంపించి చేతులు దులుపుకొన్నారు. సచివాలయం పక్కనే జరుగుతున్న ఈ కార్యక్రమానికి తమ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి వస్తున్నారా? లేదా? అని కూడా ఉన్నతాధికారులు వాకబు చేయలేదు. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం ఏర్పాట్ల కోసం ఉన్నతాధికారులు రాజధానిలోనే ఉన్నా కేఈకి ఏర్పాట్లపై సమాచారం ఇవ్వలేదు. సంబంధిత శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి కేఈ ఎందుకు రాలేదన్న అంశాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. కేఈ పట్ల సీఎం చంద్రబాబు చిన్నచూపు చూడడం, అధికారులు అవమానించడం గతంలో కూడా పలుమార్లు జరిగింది. మరో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కూడా ఇలాంటి అవమానాలే పలుమార్లు ఎదురయ్యాయి. తన శాఖకు సంబంధించి డీజీపీ కార్యాలయంలోని టెక్‌ భవన్‌ ప్రారంభోత్సవానికి కానిస్టేబుల్‌తో ఆహ్వానం పంపించి ఉన్నతాధికారులు హోంమంత్రిని అవమానించారు. 

ఎందుకు ఈ శాఖ నాకు: కేఈ
అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి కేఈ వచ్చిన సందర్భంలోనూ ఉన్నతాధికారులు ఆయన్ను పట్టించుకోలేదు. భూకర్షణ కార్యక్రమానికి కేఈ వెళ్లని విషయం తెలుసుకొని మీడియా ప్రతినిధులు ఆయనతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సమయంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలోని కొందరు అధికారులు ప్రభుత్వాన్నే శాసిస్తున్నారన్నారు. వారెన్ని ఆగడాలు చేస్తున్నా అనేక ఆబ్లిగేషన్లు ఉండడం వల్లనే ప్రభుత్వ పెద్దలు ఆ అధికారులను దారికి తేవడం లేదని అభిప్రాయపడ్డారు. శ్రీశైలం ట్రస్టు బోర్డు నియామకం కోసం సీఎంకు ఫైలు పంపి 3 నెలలైనా పరిష్కారం కాలేదన్నారు. దేవదాయ శాఖను ఎందుకు తీసుకున్నానా అనిపిస్తోందని, అనేక సందర్భాల్లో దీన్ని వదులుకోవాలని కూడా అనిపించిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కాగా కేఈ వ్యాఖ్యలు ప్రసారమాధ్యమాల్లో రావడంతో  సీఎం, సీఎంవో అధికారులు హడావుడి చేశారు. టీటీడీ ఈఓ, జేఈఓలను పిలిచి మాట్లాడారు. అయితే తాము మంత్రికి కిందిస్థాయి అధికారితో ఆహ్వానాన్ని పంపామని సీఎంఓ అధికారులకు వారు వివరించారు.

బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు
కొత్త రాష్ట్రంలో ఎలాంటి సందర్భంలోనూ బలహీన వర్గాలకు చోటు కల్పించిన చరిత్ర సీఎం చంద్రబాబుకు లేదు. రాజధానిలో శ్రీవారి ఆలయం భూకర్షణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కూడా అయిన కేఈ కృష్ణమూర్తిని ఆహ్వానించకపోవడానికి కారణం బలహీనవర్గాలను అవమానించే ఉద్దేశమే. రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలోనూ బలహీన, దళిత, మైనార్టీ నాయకులకు చోటు కల్పించలేదు. రాజధాని భూ సమీకరణ కమిటీలోనే ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి చోటు కల్పించలేదు. బలహీనవర్గాల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. బీసీలను ఓటు బ్యాంకుగానే చంద్రబాబు చూస్తున్నారు. బలహీన వర్గాలు చంద్రబాబుకు తగిన బుద్ధి  చెబుతారు.
– వైఎస్సార్‌సీపీ నేత కొలుసు పార్థసారథి

మరిన్ని వార్తలు