గంజాయి స్మగ్లింగ్‌ను అరికడతాం: నారాయణ స్వామి

5 Sep, 2019 20:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో అంచెలంచెల మద్యపాన నిషేధానికి ప్రభుత్వ ప్రయత్నం ప్రారంభమయ్యిందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్సైజ్‌ అధికారులతో గురువార కృష్ణా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, రక్షణనిది, పార్థసారథి, ప్రతాప్ అప్పారావు,సామినేని ఉదయభాను హాజరయ్యి పలు కీలక సూచనలు చేశారు. అనంతరం నారాయణ స్వామి విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నూతన ఎక్సైజ్‌ పాలసీని రూపొందించామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 20శాతం మద్యం దుకాణాలను తగ్గించామన్నారు. అంతేకాక షాపుల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మద్యం షాపులను తగ్గించడమే కాక మద్యపాన ప్రియుల్లో పరివర్తన కోసం డీ అడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు నారాయణ స్వామి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఆడపడుచులకు ఇచ్చిన మాట నిలబెట్టి వారి కళ్లల్లో ఆనందం చూడటమే సీఎం జగన్‌ ధ్యేయమన్నారు నారాయణ స్వామి. ఈ మంచి కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా ప్రతిపక్షం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలోనే నాటుసారా తయారిపై కూడా ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు