జీరో ఎఫ్‌ఐఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలి

2 Dec, 2019 16:12 IST|Sakshi

సచివాలయ మహిళా సంరక్షణ వ్యవస్థతో పెనుమార్పులు

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ 

సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ మహిళా సంరక్షణ వ్యవస్థ ద్వారా సమాజంలో పెనుమార్పులు తీసుకువస్తామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. గ్రామ సచివాలయాలకు అందే ఫిర్యాదులు పోలీసులకు అందేలా అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. ఫిర్యాదులకు సంబంధించి పోలీసు స్టేషేన్‌ పరిధిని పట్టించుకోకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని డీజీపీ తెలిపారు.

మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో గ్రామ, వార్డు మహిళా సంరక్షణ ట్రైనర్స్ వర్క్ షాప్‌ను డీజీపీ గౌతం సవాంగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతులకు సంబంధించిన మెటీరియల్‌ను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో పదమూడు జిల్లాల నుంచీ ముఖ్యమైన పోలీసు, మహిళా శిశు సంరక్షణ శాఖ అధికారులు వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. ట్రైనర్స్ అనుమానాలు నివృత్తి చేసిన డీజీపీ పలు సూచనలు ఇచ్చారు. ఆరునెలల్లో పది బ్యాచులకు పదకొండు సెంటర్లలో ట్రైనింగ్ ఇవ్వనున్నామని డీజీపీ చెప్పారు.

మహిళా సంరక్షణ కార్యదర్సులకు ఆత్మరక్షణ, యోగాలోకూడా శిక్షణ ఇచ్చి మానసిక దృఢత్వాన్ని పెంచుతామన్నారు. మహిళా సంరక్షణకు త్వరలో ఓ యాప్‌ని కూడా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. జీరో ఎఫైఆర్‌ను కచ్చితంగా అమలుచేయాలని అన్ని జిల్లాల ఏస్పీలకు, ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్టు డీజీపీ తెలిపారు. ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన స్పందనతో మార్పు వచ్చిందని, గ్రామవార్డు మహిళా సంరక్షణ వ్యవస్థ ఏర్పాటుతో సమూలమైన మార్పులు రావటం ఖాయమని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.

మరిన్ని వార్తలు