కరోనా నివారణకు ప్రజలు సహకరించాలి

22 Mar, 2020 16:32 IST|Sakshi

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

సాక్షి, మంగళగిరి: విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయని.. వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు విధిగా వైద్య ఆరోగ్య శాఖకు కచ్చితంగా సమాచారం అందించాలని పేర్కొన్నారు. అందుకు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పూర్తి సహకారం అందించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది సూచనల ప్రకారం ‘స్వీయ నిర్బంధం’ పాటించాలన్నారు. (‘నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ’)

ఐసోలేషన్‌ పూర్తికాకుండా బయట తిరగడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారు గోప్యత పాటించడం చటరీత్యా నేరమని.. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా నిబంధనలు, సూచనలు పాటిస్తున్నారా లేదా అన్న దానిపై పోలీసులు కూడా నిఘా పెడతారని పేర్కొన్నారు. ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ వంతు సహకారాన్ని అందిస్తామని డీజీపీ గౌతం సవాంగ్‌ పేర్కొన్నారు. (కరోనా వ్యాప్తిపై సీఎం జగన్‌ సమీక్ష)

మరిన్ని వార్తలు