విశాఖ రేవ్‌ పార్టీ.. 50 మంది గుర్తింపు

25 Apr, 2019 19:02 IST|Sakshi

విశాఖపట్నం: రుషికొండ రేవ్‌ పార్టీ కేసుపై ఏపీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ గురువారం స్పందించారు. ప్రశాంత విశాఖ నగరంలో రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌ రావటం విచారకరమన్నారు. రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు 50 మందిని గుర్తించి, ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డ్రగ్స్‌ సరఫరాదారులపై రౌడీషీట్‌ తరహాలో హిస్టరీ షీట్‌ తెరుస్తామని వెల్లడించారు. డ్రగ్స్‌ మాఫియా అనుసరిస్తున్న పద్ధతిని బ్రేక్‌ చేసే యోచనలో పోలీస్‌ శాఖ కసరత్తు చేస్తోందని తెలిపారు.

డ్రగ్స్‌ వినియోగం ఏ సంస్థలో జరిగినా, స్టార్‌ హోటల్‌ అయినా కూడా వారిపై కేసులు నమోదు చేయడానికి వెనకాడమన్నారు. డ్రగ్స్‌ కంట్రోల్‌పై గెజిటెడ్‌ స్థాయి అధికారి బృందం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా డ్రగ్స్‌పై తగిన సమాచారాన్ని వాట్సప్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఇవ్వాలని సూచించారు. త్వరలోనే డ్రగ్స్‌ కంట్రోల్‌పై ప్రత్యేకించి టెలీఫోన్‌ నెంబర్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అంతకుముందు విశాఖ బీచ్‌ రోడ్‌లో శక్తి బృందాలను డీజీపీ ప్రారంభించారు. మహిళల భద్రత కోసం శక్తి బృందాలు పని చేస్తాయని తెలిపారు. ఇప్పటికే విజయవాడలో శక్తి బృందాలు ప్రారంభించామని, త్వరలోనే తిరుపతితో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో శక్తి బృందాలు ఏర్పాటుల చేస్తామని చెప్పారు.

చదవండి: ఈవెంట్ల పేరుతో రేవ్‌ పార్టీలు!

మరిన్ని వార్తలు