మే 3వ వారంలో ఎంసెట్‌ ఫలితాలు వెల్లడి

1 May, 2019 14:15 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్‌ ఫలితాలు మే 3వ వారంలో వెల్లడి కానున్నాయి. ఇంటర్మీడియెట్‌ మార్కులు లేకపోవడంతో ఎంసెట్‌ ఫలితాల వెల్లడిపై సందిగ్ధత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఎంసెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఇంటర్‌ మార్కులు ఇవ్వాలని ఏపీ ఇంటర్‌ బోర్డుకు సీఎస్‌ ఈ సందర్భంగా ఆదేశించారు. గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలు ఇచ్చినా ఎంసెట్‌ కోసం మార్కులు ఇవ్వాలని సీఎస్‌ స్పష్టం చేశారు. ఇక మార్కులు రహస్యంగా ఉంచుతారా? బహిరంగంగా వెల్లడిస్తారాన అనే దానిపై సాయంత్రంలోగా స్పష్టత రానుంది. 

కాగా గ్రేడింగ్‌ విధానంలో ఇంటర్‌ ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో గ్రేడింగ్‌తో ఎంసెట్‌ వెయిటేజీ ఎలా ఇవ్వాలనే దానిపై అధికారులు తంటాలు పడుతున్నారు. ఇక తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వివాదంతోనూ ఏపీ ఎంసెట్‌కు తంటాలు వస్తున్నాయి. సుమారు 20వేలమంది తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌ రాశారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లలోనూ స్పష్టత లేకపోవడంతో రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎంసెట్‌ పలితాలు ఎలా ఇవ్వాలో అధికారులకు అంతు చిక్కడం లేదు. దీంతో సీఎస్‌ సమీక్షతో నిర్వహణ అనంతరం తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు తేలి మార్కులు అందాకే ఎంసెట్‌ ర్యాంకులు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు