ఏపీ ఎంసెట్; అదనంగా పరీక్షా కేంద్రాలు

28 Feb, 2020 20:15 IST|Sakshi

సాక్షి, కాకినాడ: ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ వి.రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. గత ఏడాది ఏవైతే నిబంధనలు అమలు అయ్యాయో, అవే నిబంధనలు ఈ ఏడాది కొనసాగుతాయని తెలిపారు. అభ్యర్ధుల సంఖ్యను బట్టి ఏరోజు ఏ పరీక్షను నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. గతంలో కొనసాగించిన పరీక్షా కేంద్రాలనే ఈసారి కొనసాగిస్తున్నామని, హైదరాబాద్‌లో మూడు ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయన్నారు. అభ్యర్ధుల సంఖ్య పెరుగుతుండటం వల్ల ఈ ఏడాది ప్రకాశం జిల్లా చిమకుర్తి, కృష్ణా జిల్లాలో తిరువూరు, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో అదనంగా పరీక్షా కేంద్రాలు పెట్టినట్టు వెల్లడించారు. అత్యధింగా ఐదు రీజినల్ ఎగ్జామ్ సెంటర్లు కృష్ణా జిల్లాలో ఉన్నాయని,  విద్యార్ధులు సౌలభ్యం కోసం కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. (చదవండి: పై తరగతులకు పటిష్టమైన అడుగులు)

ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఏపీఎంసెట్‌– 2020 నోటిఫికేషన్‌ గురువారం వెలువడింది. సెట్‌ నిర్వహణ వర్సిటీ అయిన కాకినాడ జేఎన్‌టీయూ దీన్ని విడుదల చేసింది. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రి ఇంజనీరింగ్‌), బీటెక్‌ (ఫుడ్‌సైన్సు టెక్నాలజీ), బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బీవీఎస్‌సీ, ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, బీఫార్మసీ, డీఫార్మా కోర్సులలోకి ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఈనెల 29వ తేదీనుంచి దరఖాస్తులను సమర్పించవచ్చు. మార్చి 29 చివరి గడువు. ఆలస్య రుసుము రూ.500లతో ఏప్రిల్‌ 5వరకు, రూ.1000తో ఏప్రిల్‌ 10వరకు, రూ.5వేలతో ఏప్రిల్‌ 15వరకు, రూ.10వేలతో ఏప్రిల్‌ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 16నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 20 నుంచి ప్రతి రోజూ రెండు సెషన్లలో కంప్యూటరాధారితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌కు రూ.500చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. రెండింటికీ హాజరుకాగోరే అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి. ఎంసెట్‌కు సంబంధించిన ఇతర సమాచారానికి https://sche.ap.gov.in/APSCHEHome.aspx వెబ్‌సైట్‌ను సందర్శించాలని వర్సిటీ సూచించింది. (చదవండి: సత్తా చాటిన ఏపీ విద్యార్థులు)

మరిన్ని వార్తలు