ఏప్రిల్‌ 20 నుంచి ఏపీ ఎంసెట్‌

31 Dec, 2019 03:33 IST|Sakshi

వివిధ ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ విడుదల

జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్‌

మంత్రి ఆదిమూలపు సురేశ్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశపరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఏపీఎంసెట్‌ – 2020ను ఏప్రిల్‌ 20 నుంచి 24వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేశ్‌ మాట్లాడుతూ.. అన్ని ప్రవేశపరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను కూడా ఆన్‌లైన్‌లోనే పరిశీలిస్తామని తెలిపారు. ఇందుకు మీసేవ, ఏపీ ఆన్‌లైన్, ఎస్‌ఎస్‌సీ బోర్డ్, ఇంటర్మీడియెట్‌ బోర్డ్, తదితర సంస్థలతో అనుసంధానం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ధ్రువపత్రాల పరిశీలనలో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే అలాంటి వారి కోసం ప్రతి జిల్లాలో రెండు హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రవేశపరీక్షలు పూర్తయ్యాక అడ్మిషన్ల కన్వీనర్లతోపాటు అడ్మిషన్ల తేదీలను ప్రకటిస్తామని వివరించారు. తెలంగాణ ఎంసెట్‌ కంటే ముందుగానే రాష్ట్రంలో ప్రవేశపరీక్షలను పూర్తి చేస్తామన్నారు. జేఈఈ, నీట్‌ ఇతర జాతీయ పరీక్షలకు హాజరయ్యేవారికి ఇబ్బంది కలగకుండా షెడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు.
కళాశాలలకు ఫీజు బకాయిలన్నీ చెల్లిస్తాం
వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో కోర్సుల ఫీజులపై జస్టిస్‌ ఈశ్వరయ్య నేతృత్వంలోని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కసరత్తు చేస్తోందని మంత్రి సురేశ్‌ చెప్పారు. ప్రవేశాల నాటికి ఆయా కాలేజీలకు ఫీజులు ఎంత ఉండాలో కమిషన్‌ ప్రకటిస్తుందన్నారు. ఏ కాలేజీకి ఎంత ఫీజును నిర్దేశించామో ఆన్‌లైన్‌లో అందరికీ తెలిసేలా పెడతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమయ్యేలోగా కాలేజీలకు బకాయిల మొత్తాన్ని చెల్లిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యామండలిలో గతంలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి రిటైర్డ్‌ ఐఏఎస్‌ చక్రపాణి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించామని, ఈ కమిషన్‌ నివేదిక సమర్పణకు మరో నెల గడువు పెంచుతున్నామని చెప్పారు.

నివేదిక అందాక నిధుల దుర్వినియోగానికి కారణమైన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు. కాగా, మూడేళ్ల కాలానికి ఆయా కాలేజీలకు ఫీజులను తమ కమిషన్‌ నిర్ణయిస్తుందని, ఈ మూడేళ్లలో జరిగే సెట్లన్నిటికీ ఈ ఫీజులే వర్తిస్తాయని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యా శాఖ) సతీశ్‌ చంద్ర, సాంకేతిక విద్యా కమిషనర్‌ ఎం.ఎం.నాయక్, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా