ఏపీ ఎంసెట్‌ ఫలితాల వెల్లడి వాయిదా

16 May, 2019 19:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్‌ ఫలితాల వెల్లడి తేదీని వాయిదా వేస్తున్నట్లు ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌ ఎస్‌. విజయరాజు తెలిపారు. ఏపీ ఎంసెట్‌ పరీక్షకు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల విడుదల జాప్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామన్నారు. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కాగా తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు రీ వాల్యువేషన్‌, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఇందుకు సంబంధించిన తుది ఫలితాలు మే 27న విడుదల కానున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు సెక్రటరీ వెల్లడించారు. అయితే ఏపీ ఎంసెట్‌కు కూడా తెలంగాణ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. మే 18న వెల్లడి కావాల్సిన ఏపీ ఎంసెట్‌ ఫలితాలను వాయిదా వేశారు.

>
మరిన్ని వార్తలు