అలా చేస్తే విద్యార్థులను బదిలీ చేయాలి

30 Jan, 2020 14:59 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పాఠశాలల్లో ఓవైపు తనిఖీ చేస్తూనే మరోవైపు ఆయా స్కూళ్ల సమాచారాన్ని ఆన్‌లైన్‌ చేస్తామని పాఠశాల విద్యాశాఖ నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు అన్నారు. ప్రతి జిల్లాలో వీలైనన్ని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాకు 20 మంది బోధనేతర అధికార సిబ్బంది కావాలని కోరామన్నారు. పట్టణాలు, నగరపాలక సంస్థల, మేజర్‌ పంచాయతీలోని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్యాబోధన, ఫీజుల వసూళ్లు అన్నింటినీ పరిశీలిస్తామని తెలిపారు. ఇందుకోసం ఓ పోర్టల్‌ ఏర్పాటు చేసి పాఠశాలల సమాచారం ఆన్‌లైన్‌ చేస్తామన్నారు.

అలా చేస్తే విద్యార్థుల బదిలీ
ప్రభుత్వం దిశ చట్టం ఏర్పాటు చేసినా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని చైర్మన్‌ కాంతారావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించడం నేర్పేలా పాఠాల రూపకల్పన చేస్తామని పేర్కొన్నారు. అంతేకాక విద్యార్థుల సామాజిక నేపథ్యం గురించి తెలుసుకుంటామన్నారు. లింగబేధంపై చిన్నప్పటి నుంచే వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. అఘాయిత్యాలకు పాల్పడే వారికి చాలా పెద్ద శిక్షలుంటాయని విద్యార్థులను తెలియజేయాలన్నారు. విద్యార్థులు ఇలాంటివి చేస్తే వారిని వేరే పాఠశాలకు బదిలీ చేయాలని సూచించారు. భారీగా ఫీజులు వసూలు చేసే పాఠశాలల సమాచారాన్ని అందించేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపట్టేందుకు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు