మా అధికారాలను వినియోగిస్తున్నాం

18 Mar, 2020 04:21 IST|Sakshi

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌

స్థానిక ఎన్నికల్లో కఠినంగా ప్రవర్తనా నియమావళి అమలు 

ఆరు వారాల పాటు అమల్లోనే కోడ్‌

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టుకు నివేదించింది. ఈ విషయంలో తమకున్న అధికారాలను ఉపయోగిస్తున్నామని, ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తున్నామని, నామినేషన్ల సందర్భంగా భౌతిక దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో స్థానిక ఎన్నికలను ఈనెల 15 నుంచి ఆరు వారాల పాటు లేదా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టేవరకు వాయిదా వేశామని తెలిపింది. ఈ ఆరు వారాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినా లేదా కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టినా ఈ రెండింటిలో ఏది ముందు జరిగితే అప్పుడు ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తామంది. ఎన్నికలను వాయిదా వేసినప్పటికీ 6 వారాల పాటు ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి రామసుందర్‌రెడ్డి మంగళవారం కౌంటర్‌ దాఖలు చేశారు. 

తాడిపత్రి ఎమ్మెల్యేపై చర్యలకు ఆదేశాలు...
టీడీపీ ఫిర్యాదు మేరకు అనంతపురం ఎన్నికల పరిశీలకుడి నుంచి నివేదిక తెప్పించుకున్న అనంతరం తాడిపత్రి ఎమ్మెల్యేపై చర్యలకు ఆదేశించామని, ఒక రోజు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించామని కమిషన్‌ కార్యదర్శి కోర్టుకు తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు మునిసిపాలిటీల చట్టం, పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనలతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద ఎమ్మెల్యేను ప్రాసిక్యూట్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. 
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందు వల్ల వైఎస్సార్‌ గృహ వసతి పథకం కింద ఇళ్ల పట్టాల మంజూరును నిలిపివేస్తూ సర్క్యులర్‌ జారీ చేశాం. వలంటీర్లు ఎన్నికల సమయంలో రాజకీయ కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదని ఆదేశించాం.
గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, గుంటూరు, తిరుపతి పట్టణ ఎస్పీలను బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరాం. హింసను నిరోధించడంలో విఫలమైన కింది స్థాయి పోలీసు అధికారుల బదిలీకి ఆదేశాలు ఇచ్చాం. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరుతున్నాం. 

>
మరిన్ని వార్తలు