టార్గెట్‌ యువ..

17 Mar, 2019 12:47 IST|Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో యువతరం ఓట్లు కీలకంగా మారాయి. జిల్లాలో గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్న యువత ఓటు హక్కును వినియోగించుకోనుంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు వీరిని ప్రసన్నం చేసుకోవటంపై దృష్టిసారించాయి. ఇందు కోసం ప్రత్యేక తాయిలాలను కూడా సిద్ధం చేస్తున్నాయి. క్రికెట్‌ కిట్లు ఇప్పించడం, టోర్నమెంట్లు పేరుతో ఆటలు నిర్వహించి నగదు బహుమతులు ప్రకటించటం, యువజన సంఘాలను అన్ని విధాలా ప్రోత్సహిస్తామంటూ హామీలు ఇవ్వనున్నారు. అదే విధంగా తమ పార్టీలు అధికారంలోకి వస్తే యువకుల కోసం చేపట్టే కార్యక్రమాలను ఆయా పార్టీలు ఏకరువు పెడుతున్నాయి. అంతేకాకుండా యువజన సంఘాలకు సైతం పెద్ద మొత్తం ఇస్తామంటూ కూడా రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం.


జిల్లాలో కొత్త ఓటర్లు...
జిల్లాలోని 34,28,217 మొత్తం ఓటర్లలో సుమారు 20 శాతానికి పైనే యువ ఓటర్లు ఉన్నారు. శనివారం నాటి లెక్కల ప్రకారం ఓటరు జాబితాలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు 8,03,394 మంది ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలో 7,267 మంది కొత్త ఓటర్లు తమ పేరును నమోదు చేసుకున్నారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 6,746 మంది కొత్త ఓట్లు నమోదయ్యాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో సరాసరి 6 వేల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. అత్యల్పంగా పెడనలో 3,909 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా ఓటు హక్కును పొందినవారు తమ తొలి ఓటు ఎవరికి వేస్తారోననే సంశయం అన్ని పార్టీల్లోను నెలకొంది. ఓటరు మూసాయిదా ప్రకారం 18–19సంవత్సరం లోపు వారు జిల్లాలో 82,409 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే 20–29 సంవత్సరం లోపు 7,20,985 మంది ఓటర్లు ఉన్నారు. 


మేనిఫెస్టోలో ‘యువ’గానం..
కొత్త ఓటర్లను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు యువత ప్రాధాన్యత అంశాలను పార్టీలు మేనిఫేస్టోలో చేర్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న హామీ యువతను ప్రభావితం చేసింది. అలాగే అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పింది. కానీ హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను, యువతను ప్రభుత్వం మోసం చేసింది. ఈసారి మోసపోకూడదని, యువతకు మంచి చేస్తుందన్న నమ్మకం ఉన్న పార్టీనే గెలిపించాలని నిర్ణయించుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం సరిగా అమలు కాలేదన్న అసంతృప్తి యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలే మేలని యువత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని, స్వయం ఉపాధి మార్గాలు చూపాలని, యువతకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

జిల్లాలో మొత్తం ఓటర్లు  34,28,217 మంది
యువ ఓటర్లు 8,03,394 మంది
కొత్త ఓటర్లు 82,409 మంది


   
    

   
    

మరిన్ని వార్తలు