సర్కారీ మద్యం దుకాణాలు సిద్ధం

29 Aug, 2019 12:12 IST|Sakshi
విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద మద్యం టెండరకు సంబంధించి పత్రాలు పరిశీలిస్తున్న రెవెన్యూ, ఎక్సైజ్‌ అధికారులు

ప్రభుత్వం తరఫున ఏపీఎస్‌బీసీఎల్‌ నిర్వహణ 

అక్టోబరు 1 నుంచి అమల్లోకి నూతన విధానం

మచిలీపట్నం యూనిట్‌లో 112 షాపులకు అద్దెలు ఖరారు

విజయవాడ యూనిట్‌ పరిధిలో 9 షాపులను ఉచితంగా ఇచ్చిన దరఖాస్తుదారులు

ఇక ప్రైవేటు మద్యం షాపులకు చెల్లుచీటీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఆధ్వర్యంలో అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలు నిర్వహించనున్నారు. డిస్టలరీలు, బ్రూవరీస్‌లలో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి.. దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే ఇప్పటి వరకూ పరిమితమైన ఈ సంస్థ ఇకపై స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. 

తొలి అడుగు..
రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం అమల్లో భాగంగా.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన మద్యం విధానాన్ని రూపొందించి అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ, ఎక్సైజ్‌ అధికారులు మద్యం షాపుల అద్దెకు, డిపోల నుంచి మద్యం సరఫరా, ఫర్నీచర్‌ ఏర్పాటు తదితరాలపై ఆసక్తిదారుల నుంచి టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం విజయవాడలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో టెండర్లను జేసీ మాధవీలత ఆధ్వర్యంలో ఖరారు చేశారు. 

మచిలీపట్నంలో 112 షాపులు ఖరారు.. 
మచిలీపట్నం ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో 117 షాపులకు టెండర్లను ఆహ్వానించారు. బుధవారం ఆయా షాపులకు సంబంధించి 112 మంది దరఖాస్తులను ఖరారు చేశారు. ఉయ్యూరులో 1, కైకలూరులో 3, మువ్వలో 1 షాపునకు వచ్చిన దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని రద్దు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెలతో పోలిస్తే కైకలూరులో అతి తక్కువగా 5 వేలు అద్దె ఖరారు అయ్యింది. అత్యధికంగా మచిలీపట్నం పట్టణంలో ఒక షాపునకు రూ. 45 వేలు అద్దె పలికింది. 

విజయవాడ యూనిట్‌లో..
విజయవాడ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పరిధిలో 126 షాపులకు టెండర్లను ఆహ్వానించగా 116 ఖరారు చేశారు. వీటిలో నందిగామ, పెనుగంచిప్రోలు, గంపలగూడెం ఊటుకూరులో 9 షాపులకు ఎటువంటి అద్దె తీసుకోకుండా ఉచితంగా షాపు యజమానులు ఇవ్వడం విశేషం. ఇందులో నందిగామలో 5 షాపులకు తొలుత 24 మంది దరఖాస్తు చేశారు. ఇందులో ఒక షాపునకు అత్యధికంగా 60 వేలు అద్దెను కోట్‌ చేశారు. దీంతో జేసీ మాధవీలత, ఎక్సైజ్‌ అధికారులు వారితో సంప్రదింపులు జరపగా.. చివరకు వారిలో నల్లాని అయ్యన్న, పెద్దినేని చందు, వేలది నరసింహారావు, నల్లాని శ్రీనివాసరావు, వీబీ ప్రతాప్‌లు ఉచితంగా తమ షాపులను అప్పగించేందుకు ముందుకు వచ్చారు.

పెనుగంచిప్రోలులో మూడు షాపులకు 16 మంది దరఖాస్తు చేయగా వారిలో ఒక షాపునకు దరఖాస్తుదారుడు అత్యధికంగా రూ. 41 అద్దె కోట్‌ చేశారు. వీరితోనూ అధికారులు మాట్లాడగా.. చివరకు వీరందరూ ఉచితంగా తమ షాపులను ఇవ్వడానికి ముందుకొచ్చారు. దాంతో లాటరీ పద్ధతి ద్వారా జి.పద్మావతి, ఆర్‌.దుర్గాప్రసాద్, జి.గోపిచంద్‌లను ఎంపిక చే శారు.గంపలగూడెం, ఊటుకూరులో ఒక షాపునకు రెండు దరఖాస్తులు రాగా.. పసుపులేటి వెంకటేశ్వరరావు ఉచితంగా తన షాపును ఇచ్చారు. ఇక్కడ అత్యధికంగా రూ. 30 అద్దె కోట్‌ చేశారు.

సెప్టెంబరు 1 నుంచి మొదటి దశ
ఇటీవల విజయవాడ, మచిలీపట్నం యూనిట్లలో రెన్యువల్‌ చేసుకోని 59 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదటి దశలో భాగంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి సర్కారే వీటిని నిర్వహించనుంది. ప్రైవేటు మద్యం వ్యాపారులైతే అధికాదాయం కోసం ఎక్కువ సరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే గ్రామగ్రామాన మద్యం గొలుసు దుకాణాలూ వెలిసేవి. దీంతో ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభించి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించటం వల్ల గొలుసు దుకాణాలకు అవకాశమే ఉండదు. ఎమ్మార్పీ, సమయపాలన ఉల్లంఘనలు వంటివి తగ్గుతాయి. మద్యం అందుబాటు, లభ్యత తగ్గటం వల్ల కొంతమందైనా ఈ వ్యసనం నుంచి దూరమయ్యేందుకు, కొత్తవారు దీని బారిన పడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని ఎక్సైజ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మరిన్ని వార్తలు