‘కనెక్షన్‌’ కింగ్‌ 

5 Jul, 2020 08:32 IST|Sakshi

ఫైబర్‌ నెట్‌లో కనెక్షన్ల పేరిట ఎంఎస్‌ఓ రూ.కోటి దోపిడీ 

గత టీడీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగిన అక్రమాలు  

రాజకీయ పెద్దల అండతో ప్రభుత్వ ఆదాయానికి గండి 

కేబుల్‌ ఆపరేటర్లకు బెదిరింపులు  

ప్రభుత్వానికి రూ.58 లక్షల బకాయి 

అధిక వసూళ్లకు దర్జాగా బిల్లులు  

టీడీపీ హయాంలో అట్టహాసంగా ప్రారంభించిన ఏపీ ఫైబర్‌నెట్‌ అక్రమాలకు నిలయంగా మారింది. టీడీపీ పెద్దల అండతో రాజమహేంద్రవరం బ్రాంచిలోని మెయిన్‌ సర్వీస్‌‌ ఆపరేటర్‌ (ఎంఎస్‌ఓ) యథేచ్ఛగా అక్రమాలకు తెరలేపాడు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కనెక్షన్ల పేరిట రూ.కోటి స్వాహా చేశాడు. ప్రభుత్వ ఆదేశాలతో తాజాగా ప్రక్షాళన చేపట్టిన అధికారులకు ఎంఎస్‌ఓ అక్రమాలు విస్తుగొలుపుతున్నాయి. ప్రభుత్వానికి రూ.58 లక్షల బకాయిలు చెల్లించకపోవడంతోపాటు అధిక వసూళ్లకు దర్జాగా బిల్లులు ఇచ్చిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: 2018 జూన్‌లో రాజమహేంద్రవరంలో ఏపీ ఫైబర్‌నెట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. టీడీపీ పెద్దల అండదండలతో రాజమహేంద్రవరం బ్రాంచి ఎంఎస్‌ఓ ఆశపు రాజేశ్వరరావు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డాడు. నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్ల చార్జీలను పెంచేసి అటు వినియోగదారులను, టార్గెట్ల పేరిట ఇటు ఆపరేట్లను అడ్డగోలుగా దోచేసుకున్నాడు. నగరంలో దాదాపు  వంద మంది ఆపరేటర్లు పదివేల కనెక్షన్లు తీసుకువచ్చారు. నెలకు కనెక్షన్‌ చార్జి రూ.235కు గాను ప్రభుత్వానికి రూ.105 చెల్లించగా, ఎంఎస్‌ఓ వాటా రూ.30, మిగిలిన రూ.100 ఆపరేటర్లకు చెల్లించాల్సి అతను ఉంది. కాగా జీఎస్‌టీ అంటూ రూ.85 మాత్రమే ఆపరేటర్లకు  చే ల్లించేవాడు. ఈ మేరకు ఒక్కో కనెక్షన్‌కి అదనంగా రూ.15 వంతున పదివేల కనెక్షన్లకు నెలకి రూ.1.50 లక్షలు తన ఖాతాలో వేసుకునేవాడు. ఈ మేరకు ఏడాదిలో రూ.18 లక్షల మొత్తాన్ని ఎంఎస్‌ఓ కేబుల్‌ ఆపరేటర్ల నుంచి దోచేశాడు. ఆయా ఆర్థిక లావాదేవీలకు ఫైబర్‌నెట్‌ పేరిట రశీదులు ఇవ్వాల్సి ఉండగా, అదనపు వసూళ్ల విషయం బయటకు పొక్కకుండా తనకు చెందిన శ్రీవేన్‌ గ్రూప్‌ పేరిట బిల్లులు ఇచ్చేవాడు. 2018 ఆగస్టు నెల నాటికి 100 కనెక్షన్ల లక్ష్యాన్ని పూర్తి చేసిన కేబుల్‌ ఆపరేటర్లకు కనెక్షన్‌కు రూ.250 వంతున ఏపీ ఫైబర్‌నెట్‌ చెల్లించిన ఇన్సెంటివ్‌ రూ.6.47 లక్షలు కాజేసిన విషయం వెలుగుచూసింది.  

వంద కనెక్షన్లకు వసూళ్లు.. ఉన్న మేరకే చెల్లింపులు 
వంద కనెక్షన్లు లక్ష్యం చేరుకోకుంటే తొలగిస్తారని ఎంఎస్‌ఓ భయాందోళనలకు గురిచేయడంతో 20, 30 కనెక్షన్లు ఉన్న ఆపరేటర్లు సైతం వంద కనెక్షన్ల మొత్తాన్ని చెల్లించేవారు. అయితే ఫైబర్‌నెట్‌కు మాత్రం ఉన్న కనెక్షన్లకు మాత్రమే సొమ్ము చెల్లించేవాడు. 2018 జూన్‌ నుంచి ఏడాదికాలం పాటు కనెక్షన్ల పేరిట దాదాపు 7.5 లక్షలు వసూలు చేశారు.  

పాన్‌ పేరిట అక్రమాలు :
కేబుల్‌ ఆపరేటర్లకు ఏపీ ఫైబర్‌నెట్‌ ఉచితంగా పాన్‌ (పాసీవ్‌ ఆప్టికల్‌ నెట్‌వర్క్‌) అందజేస్తుంది. కాగా ఎంఎస్‌ఓ రాజేశ్వరరావు ఒక్కొక్కరి వద్ద నుంచి పాన్‌ పేరిట రూ.5,000 నుంచి రూ.25,000 వరకు దాదాపు రూ.7.5 లక్షలు వసూలు చేసినట్టు ఓ అంచనా. బాక్స్‌లు డియాక్టివ్‌ కావడంతో ఏపీ ఫైబర్‌నెట్‌ నుంచి వెనక్కి వచ్చిన రూ.2.47 లక్షలు కేబుల్‌ ఆపరేటర్లకు ఇవ్వకుండా ఎంఎస్‌ఓ స్వాహా చేశాడు.  

ప్రభుత్వానికి బకాయిలు ఎగవేత 
కనెక్షన్లకు సంబంధించి చార్జీలను రాజేశ్వరరావు ఏపీ ఫైబర్‌నెట్‌కు చెల్లించలేదు. దాదాపు రూ.58 లక్షల బకాయిలు పేరుకుపోవడంతో ఏపీ ఫైబర్‌నెట్‌ ప్రసారాలు నిలిపివేసింది. వినియోగదారులు ఆపరేటర్లను నిలదీయడంతో చేసేదిలేక ఎంఎస్‌ఓ రాజేశ్వరరావుకు వ్యతిరేకంగా గత ఏడాది అక్టోబరులో ఆందోళనలు నిర్వహించి త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. కేబుల్‌ ఆపరేటర్లకి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లిస్తానని పోలీసుల సమక్షంలో రాజీ కూడా కుదుర్చుకున్నాడు. కాని ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు.  

వెలుగుచూస్తున్న అక్రమాలు  
2018 జూలై నుంచి 2019 జూన్‌ వరకు యథేచ్ఛగా సాగిన రాజేశ్వరరావు అక్రమాలకు ప్రభుత్వం మారడంతో తెరపడింది. ఆపరేటర్ల నుంచి అందిన ఫిర్యాదులతో అధికారులు నిర్వహించిన విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. దాదాపు కోటి రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరావు మీద చర్యలకు ఉపక్రమించిన అధికారులు అతనిని పక్కనపెట్టి మరొకరిని ఎంఎస్‌ఓగా నియమించారు.  

ప్రసారాల నిలుపుదలతో ఇబ్బంది 
ఏపీ ఫైబర్‌నెట్‌కి చెల్లించవలసిన మొత్తాన్ని నేను చెల్లించాను. కాని పాత ఎంఎస్‌ఓ వాటిని ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో మా ప్రాంతంలో ప్రసారాలను నిలుపుదల చేశారు. దానితో కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఏపీ ఫైబర్‌నెట్‌ వారు కలుగచేసుకుని మా ప్రసారాలను తిరిగి ప్రారంభించవలసిందిగా కోరుతున్నా. 
– కాకర ప్రవీణ్‌కుమార్, ఫైబర్‌నెట్‌ ఆపరేటర్‌    

మాకు కోడ్‌లను కూడా ఇవ్వలేదు 
కేబుల్‌ ఆపరేటర్లకు వ్యక్తిగతంగా ఇవ్వవలసిన కోడ్‌లకు బదులు ఎంఎస్‌ఓ రాజేశ్వరరావు తన సొంత కోడ్‌తో యాక్సిస్‌ చేసేవాడు. ఇప్పుడు ప్రసారాలను నిలిపివేయడంతో మాకు కోడ్‌ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా మాకు రావల్సిన కోడ్‌లను కూడా తన వద్దే ఉంచుకున్నాడు.  
–  బల్లా సూరిబాబు, ఫైబర్‌నెట్‌ ఆపరేటర్‌ 

బాబు శ్రీకారం చుట్టింది ఇక్కడే 
రాష్ట్రంలో ఏపీ ఫైబర్‌నెట్‌కు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మన జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. 2016 డిసెంబర్‌ 29న సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామంలో ఈ వ్యవస్థను ఆరంభించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి ఈ వ్యవస్థను ప్రారంభించిన ఈ జిల్లాలోనే ఇంత పెద్దఎత్తున దోపిడీ జరుగగా ఇక మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 
2016లో ఫైబర్‌నెట్‌ను ప్రారంభిస్తున్న నాటి సీఎం చంద్రబాబు 

మరిన్ని వార్తలు