జీతాల చెల్లింపుపై దుష్ప్రచారాన్ని ఖండించిన ఆర్థిక శాఖ

2 Aug, 2019 09:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: కొన్ని సామాజిక మాద్యమాలు, పలు టీవీ చానల్స్‌లో ప్రసారం అవుతున్న కథనాలను ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోవడానికి నిధుల కొరత కారణం కాదని ప్రకటన చేసింది. ‘సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఆర్‌బీఐ ఈ-కుబేర్‌ (ఈ-కుబేర్‌ పద్ధతిలో వేతనాలు రిజర్వ్‌ బ్యాంకు నుంచి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో ప్రతి నెలా 1న జమ అవుతాయి) ద్వారా చెల్లింపులు జరుగుతాయి. అదే ప్రకారం అన్ని జిల్లాల పింఛన్లు, జీతాల ఫైళ్లు యథాతథంగా జులై 31నే ఆర్‌బీఐకి పంపడం జరిగింది. 1వ తేదీ మధ్యాహ్నంకు పింఛన్లు పూర్తిగా, కొన్ని జీతాల ఫైళ్లు చెల్లించాం. అయితే సాంకేతిక కారణాల వల్ల ఈ-ముద్ర ద్వారా పొందిన సర్టిఫికెట్లు పని చేయకపోవడం వల్ల మిగిలిన ఫైళ్లు చెల్లింపు ఆలస్యం అయింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మిగిలిన జీతాలు చెల్లించేందుకు తగు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు.

తొలగిన సాంకేతిక సమస్య
ఉద్యోగుల జీతాలు, ఫించన్ల చెల్లింపుల్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్య తొలగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించినట్లు ఆర్థిక శాఖ శుక్రవారం ఓ ప్రకటన చేసింది.

మరిన్ని వార్తలు