ఏపీ జెన్‌కోకు ‘విద్యుత్ బిల్లు’ గండం

11 Aug, 2014 02:25 IST|Sakshi
ఏపీ జెన్‌కోకు ‘విద్యుత్ బిల్లు’ గండం

తెలంగాణకు సరఫరా అయిన కరెంటుపై మల్లగుల్లాలు
బిల్లు పంపితే పీపీఏలు ఉన్నట్టు అంగీకరించాల్సిన పరిస్థితి
 తలలు పట్టుకుంటున్న ఏపీ జెన్‌కో అధికారులు

 
స్టోరీ బోర్డు
 
హైదరాబాద్: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అంటే సరిగ్గా ఇదే. తెలంగాణకు సరఫరా అయిన విద్యుత్ విషయంలో ఏపీ జెన్‌కో సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన ఏపీ జెన్‌కోకు ఎటూపాలుపోని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్లాంట్ల నుంచి తెలంగాణకు సరఫరా అయిన విద్యుత్‌కు బిల్లు వసూలు చేయాలా? వద్దా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. పీపీఏలను రద్దు చేసుకుంటున్నట్టు ఏపీ జెన్‌కో జూన్ 17న ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ విద్యుత్ నియంత్రణ మం డలి (ఏపీఈఆర్‌సీ)కి లేఖ రాసింది. తెలంగాణ డిస్కంల ఫిర్యాదుతో గతంలో ఉన్న ఒప్పందం మేరకు తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయాల్సిందేనని బెంగళూరులోని దక్షిణ ప్రాంత విద్యుత్ నియంత్రణ మండలి (ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ) తేల్చిచెప్పింది.

అయినప్పటికీ విజయవాడలోని వీటీపీఎస్, వైఎస్సార్ కడప జిల్లాలోని ఆర్‌టీపీపీ నుంచి విద్యుత్‌ను ఇవ్వమని ఏపీ జెన్‌కో తేల్చిచెప్పింది. ఇందుకు అనుగుణంగా ఎస్‌ఆర్‌ఎల్‌డీసీకి విద్యుత్ ప్లాంట్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందనే వివరాలను (షెడ్యూలింగ్) ఇవ్వలేదు. అయితే, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ (స్కాడా) ద్వా రా ప్రతీ 15 నిమిషాలకు వచ్చే విద్యుత్ ఉత్పత్తి వివరాల ఆధారంతో ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ తెలంగాణకు విద్యుత్ కోటాను (53.89 శాతం)  కేటాయించింది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ పంపిణీ సంస్థలు విద్యుత్‌ను వినియోగించాయి. అయితే, ఇప్పుడు ఈ విద్యుత్‌కు బిల్లులు వసూలు చేయాలా? వద్దా అనే మీమాసంలో ఏపీ జెన్‌కో పడింది. ఒకవేళ బిల్లులను పంపితే విద్యుత్‌ను సరఫరా చేసినట్టు అంగీకరించాల్సి ఉంటుంది. తద్వారా తెలంగాణ డిస్కంలతో  పీపీఏ ఒప్పందం ఉన్నట్టుగా స్వయంగా ఏపీ జెన్‌కోనే అంగీకరించినట్టు అవుతుంది. ఇది తెలంగాణకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. బిల్లులివ్వకుంటే రూ. 192 కోట్ల నష్టం!

జూన్ 17వ తేదీ నుంచి ఇప్పటివరకు ఏపీ జెన్‌కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ల నుంచి సుమారు 550 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా అయినట్టు ప్రాథమిక అంచనా. జెన్‌కో విద్యుత్ ప్లాంట్ల సగటు యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూ. 3.50 అవుతుంది. అంటే 55 కోట్ల యూనిట్లకు గానూ యూనిట్‌కు రూ. 3.50 చొప్పున మొత్తం రూ. 192.5 కోట్ల మేర అవుతుంది. ఇంత భారీ మొత్తాన్ని వదులుకుంటే జెన్‌కో ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. ఈ నేపథ్యంలో బిల్లుల విషయంలో ఏపీ జెన్‌కో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ప్రభుత్వా న్ని ఆశ్రయించాలని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు