ఎన్నాళ్లకెన్నాళ్లకు..

25 Sep, 2019 10:32 IST|Sakshi
కడపలో ఏర్పాటు చేసిన సైబర్‌ క్రైం నేరాల పరిశోధన విభాగ కార్యాలయం

సాక్షి, కడప(రాజంపేట) : ఏళ్ల తరబడి ఒక పోస్టులో సేవలందించిన మండలపరిషత్‌ అభివృద్ధి అధికారులు పదోన్నతులు లేకుండానే అదే పోస్టులో ఫెవికాల్‌వీరులుగా నేటి వరకు కొనసాగారు. ఒకేపోస్టులో రెండు దశాబ్ధాలు  పైబడి పని చేశారు. 1992 నుంచి ఇలాంటి ఎంపీడీఓలు ఎందరో ఉన్నారు. కొందరైతే అదే పోస్టులో రిటైర్‌ అయ్యారు. మరికొందరు మృతి చెందారు. ఎంపీడీఓలుగా ఉన్న వీరు పదోన్నతి లేక అలాగే ఉండిపోయారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు

జగన్‌సర్కారుతో....
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంపీడీఓలకు పదోన్నతులకు మోక్షం కలిగింది. దీంతో ఎంపీడీఓల మోములో ఆనందం వెల్లివిరిస్తోంది. రిటైర్‌ అయ్యేలోపు తాము పదోన్నతి పొందుతామో లేదో అన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్న వీరికి ప్రభుత్వ నిర్ణయం ఉపశమనం కలిగింది. జిల్లాలో ఇటువంటి వారు 20 మందికిపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మందికిపైగా ఉన్నట్లు సమాచారం.

మచ్చుకు జిల్లాలో...
జిల్లాలో సుదీర్ఘకాలంగా ఎంపీడీఓలుగారమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, విజయకుమారి, వెంకటేశ్, జయసింహ, మల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, మెగిలిచెండు సురేష్, వెంకటసుబ్బయ్య, మద్దిలేటితో తదితరులు పని చేస్తున్నారు. వీరంతా ఎంపీడీఓలుగా నేటికి కొనసాగుతున్నారు. వీరు పదోన్నతి పొందితే జిల్లాపరిషత్‌ ఏఓ, డిప్యూటీ సీఈఓ, సీఈఓలుగా పని చేసేందుకు వీలవుతుంది. 

జీఓజారీ చేసిన సర్కారు..
పదోన్నతులు లేకుండా సుదీర్ఘంగా ఎంపీడీఓలుగా కొనసాగుతున్న వారి కోసం ప్రభుత్వం జీఓ నెంబరు 143 జారీ చేసింది. ఈజీఓ ప్రకారం ఎంపీడీఓలు పదోన్నతుల కోసం కాన్సుటేషన్‌ కమిటీ వేశారు. వీరి సీనియారిటీ ప్రకారం పదోన్నతుల కోసం నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించింది. కొత్త సర్వీసు విధానాలు(2001) ప్రకారం ఎంపీడీఓల పదోన్నతుల విషయం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రత్యేక కమిటీ ఇలా..
సుదీర్ఘకాలంగా పని చేస్తున్న ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీనియర్‌ ఐఏఎఏస్‌లు ఉన్నారు. కమిటీ చైర్‌పర్సన్‌గా రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సాంబశివరావు, సభ్యులుగా పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్టుమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాల్‌ కృష్ణ దివ్వేది, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్, ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనరు ఎం.గిరిజశంకర్‌లు ఉన్నారు. 

మరిన్ని వార్తలు