మున్సిపాలిటీగా పాయకరావుపేట!

15 Oct, 2019 12:34 IST|Sakshi
నగరపంచాయతీ కార్యాలయంగా మారనున్న నక్కపల్లి పంచాయతీ కార్యాలయం

నగర పంచాయతీలుగా నక్కపల్లి, ఆనందపురం

ప్రభుత్వం ఆమోద ముద్ర త్వరలో ఉత్తర్వులు

విశాఖపట్నం ,నక్కపల్లి: జిల్లాలో కొత్తగా ఒక మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి.  పాయకరావుపేటను మున్సిపాలిటీగా, నక్కపల్లి, ఆనందపురంలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఇంతవరకు మేజర్‌ పంచాయతీలుగా ఉన్న ఈ పంచాయతీలను మున్సిపాలిటీ, నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మళ్లీ వీటిపై కదలిక వచ్చింది. గత నెలలో మరోసారి ప్రతిపాదనలు కోరారు. నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వీటి వ్యవహారం ఏదో ఒకకొలిక్కి తీసుకువచ్చే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కొన్నేళ్లుగా పెండింగ్‌లో..
నక్కపల్లి, పాయకరావుపేట, ఆనందపురం మేజర్‌ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున ఈ ప్రతిపాదన మళ్లీ తెరమీదకు వచ్చింది. నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను మళ్లీ  పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఆగస్టునెలాఖరులోగా పంపించాలని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలందాయి. దీంతో అధికారులు మళ్లీ నగర పంచాయతీల ఏర్పాటుపై కసరత్తు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. నక్కపల్లికి సంబంధించి ఉపమాక, న్యాయంపూడి, సీహెచ్‌బీ అగ్రహారం, పెదబోదిగల్లం పంచాయతీలను కలిపి నగర పంచాయతీగా చేసేందుకు ప్రతిపాదనలు పంపించారు. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేయాలంటే జనాభా 20 వేలు దాటి, ఆదాయం రూ.30 లక్షలు ఉండాలి. నక్కపల్లి పంచాయతీ ఆదాయం ఏటా రూ.60 లక్షలు ఉంది జనాభా 7500 ఉంది. ఉపమాక జనాభా 5500 ఆదాయం రూ.25 లక్షల వరకు ఉంది.

న్యాయంపూడి జనాభా 1500 ఆదాయం రూ.5 లక్షలు, సీహెచ్‌బీ అగ్రహారం పంచాయతీ జనాభా1400 ఆదాయం రూ.5 లక్షలుగా ఉంది. బోదిగల్లం పంచాయతీ జనాభా కూడా 1500, ఆదాయం రూ. నాలుగు లక్షల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఈ ఐదు పంచాయతీలను కలిపి నగర పంచాయతీ చేసే అవకాశం ఉంది. ఇక పాయకరావుపేట విషయానికి వస్తే పట్టణ జనాభా సుమారు 30 వేలకుపైబడే ఉంటుంది. ఆదాయం కూడా దాదాపు రూ.రెండు కోట్ల వరకు ఉంటుంది. ఈ పంచాయతీలో పీఎల్‌పురం, సీతారామపురం పంచాయతీలను కూడా విలీనం చేసి మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఆదాయం, ఆర్థిక వనరులు, సరిపడా జనాభా ఇతర మౌలిక సదుపాయాలు ఉండటంతో పాయకరావుపేటను మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలో ప్రభుత్వం ఆమోద ముద్రవేసి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు