నేడే పెట్టుబడుల సదస్సు..

9 Aug, 2019 03:29 IST|Sakshi

విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌

35 దేశాల నుంచిహాజరు కానున్న రాయబారులు, ప్రతినిధులు 

కీలక రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే సదస్సు లక్ష్యం 

వివిధ దేశాల ప్రతినిధులతో భేటీ కానున్న ముఖ్యమంత్రి

సాక్షి, అమరావతి: ప్రపంచ దేశాల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన శుక్రవారం విజయవాడలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ పేరిట వాణిజ్య దౌత్య సదస్సు జరగనుంది. భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా వాణిజ్యం, పెట్టుబడులకు అంతర్జాతీయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ మారిందన్న విషయాన్ని చాటి చెప్పనున్నారు. 35కు పైగా దేశాల రాయబారులు, ప్రతినిధులు  పాల్గొంటున్న ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలను వివరించనున్నారు. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, పర్యాటకం వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు లక్ష్యం.

శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉన్న 974 కిలోమీటర్ల కోస్తా తీరంలో మౌలిక వసతుల అభివృద్ధికి గల అవకాశాలను వివరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు, పారిశ్రామిక విధానాలు, పర్యాటకం, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విదేశీ ప్రతినిధులకు తెలియజేస్తారు. 15కు పైగా దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఈ కార్యక్రమానికి దక్షిణ కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, బల్గేరియా, మాల్దీవులు, ఈజిప్ట్, నమీబియా, స్లోవేకియా, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ కింగ్‌డమ్, జార్జియా, జపాన్, అమెరికా, కెనడా, నెదర్లాండ్స్‌ తదితర దేశాల ప్రతినిధులు, రాయబారులు హాజరవుతున్నారు.

సదస్సు జరిగేదిలా.. 
డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు జరగనుంది. విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పి.హరీష్‌ అతిథులకు స్వాగతం పలకడంతో కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి క్లుప్తంగా సదస్సు లక్ష్యాలను వివరిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలకోపన్యాసం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం వోట్‌ ఆఫ్‌ థాంక్స్‌ చెప్పిన తర్వాత టీ విరామం సమయం ఇస్తారు.

అనంతరం రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వ అజెండాను ఎల్వీ సుబ్రహ్మణ్యం, నవరత్న పథకాలపై ఎం.శామ్యూల్, రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిపై రజిత్‌ భార్గవ, టూరిజం, బుద్ధిష్ట్‌ సర్క్యూట్స్‌పై కె.ప్రవీణ్‌ కుమార్, హెల్త్‌ టూరిజం, వైద్య రంగంలో పెట్టుబడులపై డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి వివరించనున్నారు. అనంతరం వివిధ దేశాల హైకమీషనర్లు, అంబాసిడర్లతో అధికారులు చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అనేక దేశాల ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ కావడానికి ఆసక్తి చూపిస్తున్నా సమయాభావం వల్ల కేవలం 13 నుంచి 15 దేశాల ప్రతినిధులతో మాత్రమే చర్చలు జరిపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

 

మరిన్ని వార్తలు