అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

21 Nov, 2019 18:08 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అవినీతి నిర్మూలన దిశగా  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్న అంశాలను అధ్యయనం చేసి, తగిన సూచనలు ఇవ్వడానికి ప్రతిష్టాత్మక ఐఐఎం (అహ్మదాబాద్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఐఐఎం ప్రొఫెసర్‌ సుందరవల్లి నారాయణ స్వామి, ఏసీబీ చీఫ్‌ విశ్వజీత్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారానికి నివేదిక సమర్పించాలని గడువు విధించారు. ఈ సందర్భంగా పరిపాలనలో పారదర్శకత, అవినీతి రహిత విధానాల కోసం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలను సీఎం ఈ సందర్భంగా ఐఐఎం ప్రతినిధులకు వివరించారు. గతంలో ఏపని కావాలన్నా ప్రజలు మండల కార్యాలయానికి వెళ్లేవారని, అక్కడ సకాలంలో పనులు కాకపోవడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు.

దీనికి పరిష్కారంగా అధికార వికేంద్రీకరణ, పరిపాలనను గ్రామాలకు అందుబాటులో ఉంచడం, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారుల గడపకే చేర్చడం వంటి లక్ష్యాలను సాధించడానికి గ్రామ, వార్డు సచివాలయను ఏర్పాటు చేశామని వివరించారు. గతంలో మండలంలో జరిగే పనులు ఇప్పుడు గ్రామ స్థాయిలోనే జరుగుతాయని వెల్లడించారు. జనవరి 1 నుంచి ఇవి పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, అందుకు కావాల్సిన కంప్యూటర్లు, ఇతరత్రా సామాగ్రి చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలతో ఎమ్మార్వో కార్యాలయం, కలెక్టరేట్‌, రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్‌లు ఒక్క బటన్‌తో అనుసంధానం అవుతాయని వివరించారు. దీని కోసం ఐటీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఈ అంశం కూడా పరిశీలించాలని ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. పేదలకు మంచి జరగాలనే ఉద్దేశ్యంతో అనర్హులు లబ్దిపొందకుండా ఇదంతా చేస్తున్నామని పునరుద్ఘాటించారు.

ఐఐఎం ప్రొఫెసర్‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో తమ పాత్ర ఉన్నందుకు సంతోషం వెలిబుచ్చారు. ఈ ఒప్పందం చేసుకోవడం తమ సంస్థకు లభిస్తున్న గౌరవంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు