తడారిన గొంతుక తడిపేందుకే ఎత్తిపోతల

3 Jun, 2020 03:56 IST|Sakshi

‘సీమ’పై కృష్ణా బోర్డుకు మరోసారి స్పష్టం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం 

ట్రిబ్యునల్‌ కేటాయింపుల మేరకే నీటిని వినియోగించుకుంటాం

తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్పించం

మిగులు జలాల్లో వాటాలను తక్షణమే తేల్చాలి

ఆరేళ్లు అవుతున్నా బోర్డు పరిధి ఇంతవరకు తేలలేదు

సాక్షి, అమరావతి: దుర్భిక్షంతో తడారిన రాయలసీమ గొంతుక తడపడానికే.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని కృష్ణా బోర్డుకు మరోసారి స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ రాష్ట్రానికి కేటాయించిన వాటా ప్రకారం నీటిని వాడుకోవడానికే ఎత్తిపోతల చేపట్టామని వివరించేందుకు సిద్ధమైంది. విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ సర్కార్‌ చేపట్టిన ప్రాజెక్టులను నిలుపుదల చేశాకే రాయలసీమ ఎత్తిపోతలపై చర్చించాలని స్పష్టం చేయనుంది. కృష్ణా నదిపై కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు ఇటీవల పరస్పరం బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ అంశంపై కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పందిస్తూ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా బోర్డుకు నిర్దేశం చేశారు. తక్షణమే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు.

ఈ క్రమంలో పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్‌ భగీరథ ప్రాజెక్టులతోపాటు సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ పనులను నిలుపుదల చేయాలని తెలంగాణ సర్కార్‌ను బోర్డు ఆదేశించింది. అదే తరహాలో రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఈ క్రమంలో గురువారం బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇరు రాష్ట్రాలకు చైర్మన్‌ ఎ.పరమేశం లేఖ రాశారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లతోపాటు నీటి పంపిణీ, విద్యుత్‌ పంపిణీ, టెలీమెట్రీ రెండో దశ అమలు, బడ్జెట్‌ –సిబ్బంది కేటాయింపు అంశాలను అజెండాలో చేర్చారు. కృష్ణా బోర్డు సూచనల మేరకు సమావేశంలో చర్చించే అంశాల అజెండాను ఏపీ జలవనరుల శాఖ ఖరారు చేసింది. ఆ అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ..

► శ్రీశైలంలో 881 అడుగుల్లో నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌(పీహెచ్‌పీ) ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు నీటిని తరలించవచ్చు. కానీ ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో 10 – 15 రోజులు కూడా ఉండదు. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటే పీహెచ్‌పీ ద్వారా కేవలం ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. నీటి మట్టం అంతకంటే తగ్గితే రాయలసీమ ప్రాజెక్టులకు చుక్క నీరు కూడా చేరదు. కేటాయింపులున్నా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉండదు.
► తెలంగాణ కొత్తగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్‌ భగరీథ, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీల డీపీఆర్‌లను పరిశీలించిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల డీపీఆర్‌ ఇస్తాం.
► కృష్ణా నదికి వరద వచ్చే సమయంలో ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి నీటిని విడుదల చేసే సమయంలో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోకూడదు. సాంకేతిక కమిటీ నివేదికను తక్షణమే తెప్పించి మిగులు జలాల్లో వాటాలను తేల్చాలి.
► నాగార్జునసాగర్‌ ఎడమ కాలువలో 39.41 – 43.67 శాతం వరకు సరఫరా నష్టాలను తెలంగాణ సర్కార్‌ చూపిస్తోంది. దీంతో ఏపీ వాటా కింద రావాల్సిన జలాలు రావడం లేదు. సరఫరా నష్టాలను తేల్చడానికి రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేయాలి. 
► కృష్ణా బోర్డు ఏర్పాటై 6 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బోర్డు పరిధిని తేల్చలేదు. వర్కింగ్‌ మ్యాన్యువల్‌ను ఆమోదించలేదు. తక్షణమే పరిధిని ఖరారు చేసి వర్కింగ్‌ మ్యాన్యువల్‌ను ఆమోదించాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డు పరిధిలోకి తీసుకోవాలి. 
► విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా పనిచేయాలి. బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలించాలి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా