పేదలకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు

2 Jun, 2020 19:09 IST|Sakshi

గత ప్రభుత్వం పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని సీఎం నిర్ణయం

రూ.1,323 కోట్లు చెల్లించేందుకు అధికారులకు ఆదేశాలు

పేదలకు ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద ప్రజలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. గత ప్రభుత్వం పేదలకు పెట్టిన ఇళ్ల బకాయిలను చెల్లించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈ చెల్లింపులు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నిధులు సమీకరించుకుని చెల్లింపులకు ఒక తేదీ ప్రకటించాలని సీఎం అధికారులకు చెప్పారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌జైన్‌సహా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
(చదవండి: మోదీపై విశ్వాసం: టాప్‌-5లో సీఎం జగన్)

మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల నిర్మాణంపై సమీక్షించిన సీఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా సదుపాయాలు ఉండేలా చూస్తున్నామని సీఎం తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం తెలిపారు. సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. 

‘పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు లేకుండా ఇంటిని సమకూర్చాలి. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలి. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలి. గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరుపోవాలి, గవర్నమెంటు చేస్తే నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలి. పేదలకోసం చేస్తున్న ఈకార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే పుణ్యం దక్కుతుంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపడుతున్నాం’అని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
(చదవండి: మూడు రోజులు శ్రీవారి దర్శనం ట్రయల్‌ రన్‌)

ఇళ్ల నిర్మాణం ద్వారా ఏర్పడుతున్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జులై 8న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ కార్యక్రమంపైనా సీఎం సమీక్షించారు. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. వారికి కేటాయించిన స్థలంవద్దే అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు