గుండెచప్పుళ్లపై గూండాగిరీ

27 Jan, 2017 01:50 IST|Sakshi
గుండెచప్పుళ్లపై గూండాగిరీ
ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా ఉద్యమంపై బాబు సర్కార్‌ ఉక్కుపాదం
 
- వైఎస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దౌర్జన్యం.. రన్‌వేపై నిర్బంధం
- ఎయిర్‌పోర్టులోకి వందలమంది పోలీసులు, టీడీపీ గూండాలు
- ఏపీ ప్రతిపక్షనేత, ఇద్దరు ఎంపీలను చుట్టుముట్టి నెట్టేసిన రౌడీలు
- లాంజ్‌లోకి కూడా ప్రవేశించనీయకుండా ఖాకీల ఓవరాక్షన్‌
- మూడు గంటల సేపు విమానాశ్రయంలోనే జగన్‌ ఆందోళన
- బలవంతంగా హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు
- ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో పెల్లుబిక్కుతున్న ఆగ్రహావేశాలు
 
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విశాఖపట్నం
ఏపీ చరిత్రలో ఇదో చీకటి రోజు..
బాబు దుర్మార్గ పాలనకు మరో మచ్చుతునక..
పోలీసు రాజ్యంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ..
నియంతృత్వ వ్యవస్థలో ఉన్నామా 
అన్నంత దారుణంగా వ్యవహరించారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం
రోజే రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు..
ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపడానికి 
సిద్ధమైన ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారు..
ఐదున్నరకోట్ల ప్రజల ‘ప్రత్యేక హోదా’ ఆకాంక్షను 
చిదిమేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు..
శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీకి ప్రయత్నిస్తున్న 
నిరసనకారులపై నిర్బంధం ప్రయోగించారు..
చంద్రబాబు ప్రభుత్వ ‘అదుపాజ్ఞ’లతో చెలరేగుతున్న 
ఖాకీలు గురువారం తమ విశ్వరూపం ప్రదర్శించారు.
 
బాధ్యతగలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం సాగిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పోలీసులు, పోలీసుల ముసుగులో ఉన్న తెలుగుదేశం గూండాలు దౌర్జన్యానికి పూనుకున్నారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక ప్రతిపక్షనాయకుడిపై సాగిన అఘాయిత్యం చూసి రాష్ట్రం నివ్వెరపోయింది. ప్రత్యేకహోదా ఉద్యమానికి కీలకంగా ఉన్న వైఎస్‌ జగన్‌ను ఉక్కుపాదంతో తొక్కేసేందుకు చంద్రబాబు సర్కార్‌ ఎంతకైనా తెగిస్తుందని మరోమారు రుజువైంది. ఒక సంఘవిద్రోహ శక్తితోనో, ఒక రౌడీతోనో, ఒక గూండాతోనో వ్యవహరించినట్లు పోలీసులు వ్యవహరించారు.
 
రాష్ట్రానికి ప్రతిపక్షనేత, ఒక రాజకీయ పార్టీ అధినేతపై ఇంతటి నిర్బంధమా అని రాష్ట్రం నిర్ఘాంతపోయింది. ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ఇంత నీతిమాలిన రాజకీయాలు చేయాలా అని ప్రజలు నిరసిస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని దుమ్మెత్తిపోస్తున్నారు. శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖపట్నం విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అడ్డుకున్నారు. కేంద్రప్రభుత్వ బలగాలైన సీఐఎస్‌ఎఫ్‌ అధీనంలో ఉండాల్సిన విమానాశ్రయాన్ని రాష్ట్రపోలీసులు, తెలుగుదేశం గూండాలు అదుపులోకి తీసుకుని అంతులేని నిర్బంధాన్ని ప్రయోగించారు.
 
ప్రతిపక్షనేతను, ఇద్దరు ఎంపీలను కనీసం ప్రొటోకాల్‌ కూడా పాటించకుండా నెట్టేశారు. విమానాశ్రయ లాంజ్‌లోకి కూడా ప్రవేశించనీయకుండా తలుపులు మూసేశారు. తాను శాంతియుత ప్రదర్శన కోసం వచ్చానని, బయటకు వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్‌ జగన్‌ అభ్యర్థించినా పోలీసులు వినలేదు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఎయిర్‌పోర్ట్‌ రన్‌ వేపై జగన్, ఇతర నేతలు దాదాపు రెండుగంటల సేపు బైఠాయించారు. జగన్‌ వెంట ఉన్న విజయసాయిరెడ్డి, వైవి.సుబ్బారెడ్డిని, అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు.
 
వైఎస్‌ జగన్‌ను నిర్బంధించిన విషయం తెలుసుకున్న విశాఖప్రజలు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. ప్రత్యేకహోదా– ఆంధ్రుల హక్కు, జై జగన్‌ నినాదాలతో ఆ పరిసరాలు మార్మోగిపోయాయి. విశాఖ ఆర్కే బీచ్‌లో జరగాల్సిన కొవ్వొత్తుల ర్యాలీ విమానాశ్రయం వెలుపల జరిగింది. పోలీసుల దుర్మార్గమైన నిర్బంధం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇళ్లపైనే కొవ్వొత్తులు వెలిగించి తమలో ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంత బలంగా ఉందో తేల్చి చెప్పారు.
 
కనీస మర్యాద పాటించరా?
1.27 కోట్ల ఓట్లతో 67 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీ అధినేత.. అధికారపక్షానికి 5 లక్షల ఓట్లే తేడా. బలమైన ప్రతిపక్ష నేత.. అలాంటి వ్యక్తికి.. అందునా ప్రజలకోసం గాంధేయమార్గంలో శాంతియుత ర్యాలీలో పాల్గొనడానికి వస్తున్న నాయకుడికి ఈ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన మర్యాద ఇదేనా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడికి మర్యాద ఇవ్వడం ఇష్టం లేకపోయినా కనీసం ప్రొటోకాల్‌ పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమౌతోంది.
 
విమానం దిగగానే రన్‌వేపైకి వందలాది మంది పోలీసులు చేరుకోవడమేమిటి? రన్‌వేపైనే అడ్డుకోవడమేమిటి? ప్రతిపక్ష నాయకుడిగా కాదు కనీసం ఒక సాధారణ ప్రయాణీకుడి విషయంలో కూడా ఇలా వ్యవహరించకూడదు కదా! ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని జనం చర్చించుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడితో మార్యదగా వ్యవహరించాల్సిందని, ప్రభుత్వం తరఫున ఎవరైనా ప్రతినిధులు మాట్లాడి ఉండాల్సిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.
 
పోలీసులో గూండాలో అర్ధం కాని రీతిలో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా చుట్టుముట్టి భయకంపితులను చేయడం, అడుగుతున్నా ప్రయాణీకుల లాంజ్‌లోకి అనుమతించకపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోంది. సాధారణంగా విమానాశ్రయం కేంద్ర బలగాలైన సీఐఎస్‌ఎఫ్‌ అధీనంలో ఉంటుంది. కానీ వాళ్లను కూడా భయపెట్టి, నిస్సహాయ స్థితిలోకి నెట్టి విమానాశ్రయాన్ని పోలీసులు తమ అధీనంలోకి తెచ్చుకోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
పోలీసులా? గూండాలా?
అసలు విమానాశ్రయాన్ని పోలీసులు ఆక్రమించడమే అనుమానాస్పదమైతే.. అందులో గూండాలు ఉండడం మరింత ఆశ్చర్యకరం. వారి వ్యవహారశైలి పోలీసుల మాదిరిగా లేదు. యూనిఫాం లేదు. ఐడీ కార్డుల్లేవు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ అందరినీ తోసేస్తూ గూండాల్లానే వ్యవహరించారు. ప్రతిపక్షనేతను, ఎంపీలను పక్కకు తోసేయడం, పట్టుకుని లాగేందుకు ప్రయత్నించడం అనుమానాస్పదంగా కనిపించిందని అక్కడి ప్రయాణీకులు వ్యాఖ్యానిస్తున్నారు.గూండాలను తీసుకొచ్చి వారంతా మఫ్టీలో ఉన్న పోలీసులు అని చెప్పినట్లు అర్ధమౌతున్నది.
 
బలవంతంగా విమానంలోకి..
శాంతియుత ప్రదర్శనలో పాల్గొంటామని ప్రతిపక్ష నేత ఎంత చెప్పినా పోలీసులు అస్సలు వినిపించుకోలేదు. విమానాశ్రయం లాంజ్‌లోకి కూడా రానివ్వకుండా తలుపులకు తాళాలేసి తిరిగి బలవంతంగా హైదరాబాద్‌ విమానం ఎక్కించడం చూస్తుంటే అంతా ఒక స్క్రిప్టు ప్రకారం పక్కాగా అమలు చేసినట్లు అర్ధమౌతున్నది. టికెట్లు కూడా పోలీసులే తీసుకుని వైఎస్సార్సీపీ నాయకులను హైదరాబాద్‌ విమానంలోకి బలవంతంగా తరలించారని తెలుస్తోంది. ప్రతిపక్షనేత ఒక శాంతియుత ర్యాలీలో పాల్గొనడానికి వస్తుంటే ఇలా బలవంతంగా విమానాశ్రయంలోనే అడ్డుకుని వెనక్కి తిప్పి పంపడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని వినిపిస్తోంది. 
 
విశాఖ విమానాశ్రయంలో హైడ్రామా
కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వైఎస్‌ జగన్, పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పుట్టా ప్రతాప్‌రెడ్డి తదితరులతో కలిసి సాయంత్రం 3.50 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టులో విమానం దిగారు. రన్‌వేపైకి వస్తుండగానే పదిమంది ఏసీపీలు, డీఐజీ శ్రీకాంత్, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, నాలుగు రోప్‌పార్టీలతో ఒక్కసారిగా జగన్‌ను చుట్టుముట్టారు. డొమెస్టిక్‌ అరైవల్స్‌ గేటువద్దకు రాకుండానే అడ్డుకున్నారు. అరైవల్‌ గేటుకు తాళం వేసి జగన్‌ను బయటకు రాకుండా నిలువరించారు. అడ్డొచ్చిన ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ నేత అంబటి రాంబాబులను పక్కకు నెట్టేసేందుకు యత్నించారు. దీంతో వైఎస్‌ జగన్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
 
‘‘ఎలా బిహేవ్‌ చేయ్యాలో తెలియనోళ్లు పోలీసులు ఎలా అయ్యారు.. డొమెస్టిక్‌ ఎరైవల్‌ బోర్డు కనపడడం లేదా మీకు .. ప్రయాణీకులను పంపించరా.. అయితే.. ఆ బోర్డు పీకేయండి.. అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. డోర్‌ ఓపెన్‌ చేయండి....డొమస్టిక్‌ ఎరైవల్స్‌ ఎయిర్‌పోర్టు రన్‌వే పై ఆపుతారేంటి.. ఏం మాట్లాడుతున్నారో.. ఏం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా అని ప్రశ్నించారు. అసలు మీరు పోలీస్‌ యూనిఫాం వేసుకోలేదు.. మీరు పోలీసులేనా... మీ ఐడెంటిటీ కార్డులేవీ... గుర్తింపు కార్డుల్లేకుండా ఎలా వచ్చారు.. అంటూ సివిల్‌ డ్రస్‌లో ఉన్న వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఎయిర్‌పోర్టులోకి పోలీసులు ఎలా వచ్చారు...
ఎయిర్‌పోర్టులోకి చొరబడిన ఏపీ పోలీసులను జగన్‌ నిలదీశారు.. ‘ఎయిర్‌ పోర్టు కేంద్ర ప్రభుత్వ భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులను ఎలా అనుమతించారు. విమానంలో వచ్చే ప్రయాణికుల పట్ల ఇలాగే వ్యవహరిస్తారా. రన్‌వే మీద ఆపుతారేంటి. ఫ్‌లైట్‌ దిగినవారిని వెళ్లనివ్వకుండా రన్‌వేమీద అడ్డుకుంటారా. అసలు ఒక పాసింజర్‌గా కూడా కనీసం డొమెస్టిక్‌ అరైవల్స్‌ పోనీయకుండా ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు. ఏం చేయాలని ఆపుతున్నారు’అని నిలదీశారు. తాము ఇక్కడే కూర్చుంటామని, తరువాత వచ్చే ఫ్‌లైట్‌ ప్రయాణికుల కోసమైనా గేటు తెరవాల్సిందేనని, అప్పటివరకు తాము కదిలేది లేదని స్పష్టం చేశారు. అక్కడే రన్‌వైపైనే వైఎస్‌ జగన్‌ కింద కూర్చుండిపోయారు.
 
రన్‌వేపైనే ధర్నా
వైఎస్‌ జగన్‌తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రన్‌వే మీదే ధర్నా చేపట్టారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 45 నిమిషాల పాటు జగన్‌ రన్‌వైపేనే కూర్చుండిపోయారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చేందుకు డొమెస్టిక్‌ అరైవల్స్‌ గేటువైపు వస్తుండగా పోలీసులు ఆ గేటుకు తాళం వేసేశారు. దీంతో జగన్‌ మరోసారి అక్కడే బైఠాయించారు. ప్రభుత్వ వైఖరికి, పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద పెట్టున నినదించారు. ఈ సందర్భంలో పోలీసులు వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చి లాంజ్‌లోకి రావాల్సిందిగా సూచించారు. దీంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘రెండే రెండు సంవత్సరాలు ఆగండి. ఎవర్నీ నేను మర్చిపోన’ంటూ హెచ్చరిక చేయడంతో ఒక్కసారిగా పోలీసులు వెనక్కి తగ్గారు.
 
అలా ఆపడం సరికాదని అంగీకరించిన సీపీ యోగానంద్‌
మరోవైపు వైఎస్‌ జగన్‌కు మద్దతుగా ఎయిర్‌పోర్టు బయట వేలాదిమంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, జగన్‌ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన విశాఖ పోలీస్‌ కమిషనర్‌ టి.యోగానంద్‌ వైఎస్‌ జగన్‌తో చర్చలు జరిపారు. రిపబ్లిక్‌ డే వేడుకలతో పాటు విశాఖలో భాగస్వామ్య సదస్సు జరుగుతున్న నేపథ్యంలో 144సెక్షన్‌ అమల్లో ఉందని, అందుకే ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోవాలని అభ్యర్ధించారు. తాను కొవ్వొత్తుల ర్యాలీకి వెళ్లాలని..బయటకు వెళ్లేందుకు గేట్లు తెరవాల్సిందిగా జగన్‌ కోరారు. గందరగోళంలో మా అధికారులు రన్‌వే వద్ద ఆపడం సరికాదు.. అది తెలుసుకునే మీకు వివరించేందుకు వచ్చాను.. ర్యాలీకి అనుమతి లేదు.. దయచేసి మీరు తిరిగి వెళ్లండి.. అని సీపీ యోగానంద్‌ వివరించారు. వైఎస్‌ జగన్‌తో పాటు ఎంపీలు, ఇతర నేతలను కూడా అదే విమానంలో తిరిగి హైదరాబాద్‌ పంపించారు.
 
నేను చంద్రబాబు తొత్తును : ఏసీపీ భీమారావు
విశాఖ నార్త్‌ ఏసీపీ భీమారావు తీరు వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులకు విస్మయం కలిగించింది. ఎంపీలు, పార్టీ నేతల పట్ల ఒకింత దురుసుగా ప్రవర్తిస్తున్న భీమారావును వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు వారించేందుకు యత్నించారు. దీంతో భీమారావు మరింత రెచ్చిపోయారు. దీంతో అంబటి.. మీరు పోలీసులా చంద్రబాబు తొత్తులా అని నిలదీశారు. ఇందుకు భీమారావు స్పందిస్తూ.. అవును.. నేను చంద్రబాబు తొత్తునే అని వ్యాఖ్యానించడంతో అందరూ విస్తుపోయారు. కాగా, ఎంపీలని కూడా చూడకుండా అమర్యాదగా వ్యవహరించిన పోలీసు అధికారుల తీరుపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.
 
 
ఉదయం నుంచే పోలీసు వలయం
ఆర్కే బీచ్‌లో సాయంత్రం జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టును పోలీసులు తమ ఆధీనంలోకి తీసకున్నారు. డీజీపీ సాంబశివరావు ఉదయాన్నే విశాఖకు చేరుకుని ఎయిర్‌పోర్టులోనే మకాం వేసి ఉద్యమ అణచివేతకు వ్యూహాలు పన్నారు. మరో వైపు జగన్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, శ్రేణులు పెద్దఎత్తున తరలివస్తారన్న సమాచారంతో ఎయిర్‌పోర్టును పూర్తిగా పోలీసుల వలయంగా మార్చేశారు.
 
ప్రయాణ టిక్కెట్టు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించారు. వారి వెంట సాగనంపేందుకు వచ్చిన కుటుంబ సభ్యులను కూడా బయటే ఆపేశారు. విమానాశ్రయంలోకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను, సామాన్య ప్రజలను అనుమతించలేదు. కనీసం విమానాశ్రయం ప్రాంగణంలోకి వచ్చే రహదారిలో కూడా వారిని ప్రవేశించనివ్వలేదు. అసలు సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఉండే విశాఖ ఎయిర్‌ పోర్ట్‌ లోకి లోకల్‌ పోలీసులను అనుమతించడంలోనే ఈ ప్రభుత్వం కుట్ర అర్ధమౌతున్నదని వైఎస్సార్సీపీ నాయకులు వ్యాఖ్యానించారు.
 
ఎయిర్‌పోర్టు బయట కొవ్వొత్తులతో ప్రదర్శన
మరోవైపు వైఎస్‌ జగన్‌ను తిరిగి విమానం ఎక్కించేందుకు రాత్రి ఆరు గంటల సమయంలో వీఐపీ లాంజ్‌ వైపు తీసుకువస్తుండగా.. బయట అద్దాల్లో నుంచి చూసిన అభిమానులు, పార్టీ నేతలు ఒక్కసారిగా జైజగన్‌ నినాదాలు హోరెత్తించారు. ఆయన్ను అటు నుంచే రన్‌వే పైకి తీసుకువెళ్లిన తర్వాత ఎయిర్‌పోర్టు బయట ఒక్కసారిగా వేలాదిమంది పార్టీ కార్యకర్తలు, నేతలు కొవ్వొత్తులు వెలిగించారు. జై జగన్‌.. హోదా కోసం ఎందాకైనా... డౌన్‌ డౌన్‌ చంద్రబాబు అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉదయం నుంచి పోలీసు అధికారులు ఎయిర్‌పోర్టును ముట్టడించి ఎవ్వరూ ఎయిర్‌పోర్టు ప్రాంగణానికి కూడా రాకుండా అడ్డుకున్నారు. చివరికి సాధారణ విమాన ప్రయాణీకులను సైతం చుక్కలు చూపించారు. అయితే వైఎస్‌ జగన్‌ లాంజ్‌లో కనిపించగానే,... వేలాదిమంది దూసుకొచ్చి లాంజ్‌ బయట నినాదాలు చేయడం, కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శన చేపట్టడంతో పోలీసు అధికారులు షాక్‌ తిన్నారు.
ఎయిర్‌పోర్టు బయట కొవ్వొత్తులతో ప్రదర్శన
మరోవైపు వైఎస్‌ జగన్‌ను తిరిగి విమానం ఎక్కించేందుకు రాత్రి ఆరు గంటల సమయంలో వీఐపీ లాంజ్‌ వైపు తీసుకువస్తుండగా.. బయట అద్దాల్లో నుంచి చూసిన అభిమానులు, పార్టీ నేతలు ఒక్కసారిగా జైజగన్‌ నినాదాలు హోరెత్తించారు. ఆయన్ను అటు నుంచే రన్‌వే పైకి తీసుకువెళ్లిన తర్వాత ఎయిర్‌పోర్టు బయట ఒక్కసారిగా వేలాదిమంది పార్టీ కార్యకర్తలు, నేతలు కొవ్వొత్తులు వెలిగించారు. జై జగన్‌.. హోదా కోసం ఎందాకైనా... డౌన్‌ డౌన్‌ చంద్రబాబు అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉదయం నుంచి పోలీసు అధికారులు ఎయిర్‌పోర్టును ముట్టడించి ఎవ్వరూ ఎయిర్‌పోర్టు ప్రాంగణానికి కూడా రాకుండా అడ్డుకున్నారు. చివరికి సాధారణ విమాన ప్రయాణీకులను సైతం చుక్కలు చూపించారు. అయితే వైఎస్‌ జగన్‌ లాంజ్‌లో కనిపించగానే,... వేలాదిమంది దూసుకొచ్చి లాంజ్‌ బయట నినాదాలు చేయడం, కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శన చేపట్టడంతో పోలీసు అధికారులు షాక్‌ తిన్నారు.
>
మరిన్ని వార్తలు