బాబు, రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఉద్యోగుల ఆగ్రహం

22 Apr, 2019 03:56 IST|Sakshi

నిరసనగా ఈ నెల 24న ధర్నాకు పిలుపు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 24వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ధర్నాచౌక్‌లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో 8.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాధాకృష్ణ దారుణ వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయని చెప్పారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి, పని గంటలతో సంబంధం లేకుండా, వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్‌లు, జన్మభూమి కార్యక్రమాలు, ఇతరత్రా ప్రభుత్వ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అవమానకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.

ఈ విషయంపై రాధాకృష్ణ ఇంతవరకూ స్పందించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహావేశాలు రగిలిస్తోందన్నారు. రాధాకృష్ణ ఉద్యోగులపై వాడిన పదజాలం వల్ల ప్రతి ఉద్యోగి ఆత్మాభిమానం దెబ్బతిందన్నారు. అంతేకాకుండా ఉద్యోగ వర్గాల ప్రతినిధి రాష్ట్ర ముఖ్య కార్యనిర్వహణాధికారి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై కొందరు రాజకీయ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రతి ఉద్యోగి ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని, మనో ధైర్యాన్ని దెబ్బతీసిన రాధాకృష్ణ వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ నెల 24న ధర్నా చౌక్‌ వద్ద చేపట్టే నిరసన కార్యక్రమానికి ఆత్మాభిమానం గల ఉద్యోగులందరూ హాజరు కావాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు