గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు మేరకే.. పోలవరం

11 Feb, 2020 05:57 IST|Sakshi

డిజైన్‌లను మార్చామని ఒడిశా సర్కారు చేస్తున్న వాదనలో నిజం లేదు

సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు జలాశయం భద్రత కోసమే స్పిల్‌ వే సామర్థ్యం పెంపు

ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగితే అంచనా వ్యయం భారీగా పెరుగుతుంది

ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి సహకరించండి

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం 

నేడు సుప్రీంకోర్టులో విచారణ 

సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు మేరకే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజైన్‌లు మార్చామని ఒడిశా సర్కార్‌ చేస్తున్న వాదనలో వీసమెత్తు వాస్తవం లేదని తెలిపింది. అవాస్తవ అంశాలు వల్లె వేస్తూ ఒడిశా సర్కార్‌ న్యాయస్థానాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని వివరించింది. ‘దేశంలో జైసల్మేర్‌ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యేది అనంతపురం జిల్లాలోనే. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దుర్భిక్ష అనంతపురం జిల్లాతోపాటు రాష్ట్రంలోని 13 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తే రాష్ట్రం సుభిక్షమవుతుంది. ఇందుకు సహకరించాలి’ అని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు 78 పేజీల అఫిడవిట్‌ (ప్రమాణపత్రం)ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. పోలవరం పనులు నిలుపుదల చేయాలని కోరుతూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది.

ఏపీ సర్కార్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ముఖ్యాంశాలు ఇవీ..
- గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డులో భాగంగా ఏప్రిల్‌ 2, 1980లో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా సర్కార్‌ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 150 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం నిర్మిస్తున్నాం.
గోదావరికి గత 500 సంవత్సరాల్లో ఆగస్టు 16, 2016న గరిష్టంగా 35,06,388 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. వచ్చే పదివేల సంవత్సరాల్లో గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం లేదు. 
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు జలాశయం భద్రత కోసమే 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసే సామర్థ్యంతో పోలవరం స్పిల్‌ వేను నిర్మిస్తున్నాం. దీని వల్ల తమ రాష్ట్రంలో అధికంగా ముంపు ఉంటుందని ఒడిశా సర్కార్‌ చేస్తున్న వాదన అవాస్తవం. సుప్రీంకోర్టు నియమించిన నిపుణులు గోపాలకృష్ణన్‌ ఏప్రిల్‌ 11, 2011న ఇదే అంశాన్ని స్పష్టం చేశారు.
- 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం స్థానంలో 50 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా పోలవరం స్పిల్‌ వేను చేపట్టడంపై మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఒడిశా సర్కార్‌ ఏప్రిల్‌ 17, 2018న సుప్రీంకోర్టు ముందు వాదించింది. కానీ ఇప్పుడు విభిన్న అంశాలను తెరపైకి తేవడం ఆ రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని బహిర్గతం చేస్తోంది.
- ప్రాజెక్టు నిర్మాణంపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు నిర్వహించాలని ఏపీ సర్కార్‌ 2005 నుంచి కోరుతోంది. కానీ..ఆ రెండు రాష్ట్రాలు నిర్వహించలేదు. ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏపీ సర్కార్‌ పోలవరం పనులు చేస్తోందని, నిలుపుదల చేయాలని ఒడిశా సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆశ్చర్యకరం. 
- పోలవరం పనులు నిలుపుదల చేయాలంటూ కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను అభయన్స్‌ (తాత్కాలిక నిలుపుదల)లో పెడుతూ జనవరి 1, 2014, జూన్‌ 23, 2015, ఆగస్టు 12, 2016, జూలై 5, 2017, జూలై 10, 2018, జూన్‌ 27, 2016న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినప్పుడు స్పందించని ఒడిశా సర్కార్‌.. ఇప్పుడు వాటిపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఔచిత్యమేమిటి?
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు లేవనెత్తిన అంశాలను పూర్తి స్థాయిలో పరిష్కరించాకే పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తాం. ముంపునకు గురికాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో శబరి, సీలేరు నదులకు గట్లును నిర్మిస్తాం.
- ఆర్థికపరంగా చూస్తే ఇప్పటిదాకా రూ. 16,996.76 కోట్ల విలువైన పనులు మాత్రమే పోలవరంలో పూర్తయ్యాయి. అంటే కేవలం 30.60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. 
పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. ఇతర రాష్ట్రాల సహాయ నిరాకరణ వల్ల శిక్షను అనుభవించేందుకు ఏపీ సర్కార్‌ సిద్ధంగా లేదు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగితే అంచనా వ్యయం భారీగా పెరుగుతుంది. ఇది రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేస్తుంది. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్‌ను సుభిక్షం చేయడానికి సహకరించాలి. 

మరిన్ని వార్తలు