కేంద్రం చేసిందేమీ లేదు : ఏపీ అఫిడవిట్‌

23 Jun, 2018 21:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. విభజన హామీల అమలుపై కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, ఆ విషయాన్ని పక్కన బెట్టిందని అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం కేంద్రం తీరును తప్పుబట్టింది. అంతేకాదు హోదా ఉన్న రాష్ట్రాలతో సమానంగా పన్ను రాయితీలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టింది. వెనుకబడిన జిల్లాలకు 24,350 కోట్ల రూపాయల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని కోరామని, 1050 కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇచ్చిందని వెల్లడించింది.

పోలవరం ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం 7,918.40 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, కేంద్రం 5,349.70 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా విలువ 57,948.86 కోట్లను అనుమతించలేదని, విభజన హామీల్లో ఏ ఒక్క దాన్ని కేంద్రం అమలు చేయలేదని ఆరోపించింది. షెడ్యూల్‌-9లో ఉన్న 142 విద్యాసంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని, కడప స్టీల్‌ ప్లాంట్‌, గిరిజన వర్సిటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీ పేర్కొంది.

నాలుగేళ్లలో జాతీయ విద్యాసంస్థల నిర్మాణానికి 10 శాతం కన్నా తక్కువ నిధులు కేటాయించారని, దుగ్గరాజపట్నం పోర్టు, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాట్లపై దృష్టి సారించలేదని వాపోయింది. రైల్వేజోన్‌ ఇంకా పరిశీలనలోనే ఉందని కేంద్రం చెబుతోందని, అమరావతి నిర్మాణానికి 11,602 కోట్ల రూపాయలతో డీపీఆర్‌ పంపామని, 1500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం విడుదల చేసిందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

మరిన్ని వార్తలు