ఆదాయానికి ఐడియా..!

10 Dec, 2019 11:04 IST|Sakshi

గ్రానైట్‌ సీనరేజి వసూళ్లకు కాంట్రాక్టర్ల ఎంపిక

టెండర్‌ బిడ్‌ దాఖలుకు నెలాఖరు వరకు గడువు

రూ.450 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం

ప్రయోగాత్మకంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అమలు

జాతీయ రహదారులపై టోల్‌ వసూలు తరహాలోనే ఇక గ్రానైట్‌ ఉత్పత్తులకూ ఇకపై రుసుము వసూలు చేయనున్నారు. అందులో భాగంగా రాయల్టీ వసూళ్లకు టెండర్ల కోసం ప్రకటన కూడా జారీ చేశారు. దీనికి ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. గ్రానైట్‌ గనుల నుంచి పెద్ద మొత్తంలో ముడిరాయి రాయల్టీ చెల్లించకుండానే సరిహద్దు దాటిపోతోందని వివిధ రకాల నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.వందల కోట్లలో ఆదాయానికి గండి పడుతున్న నేపథ్యంలోనే దొంగ చేతికి తాళం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

సాక్షి, ఒంగోలు: జిల్లాలో అన్ని రకాల ఖనిజాలకు సంబంధించి మొత్తం ఎనిమిది మైనింగ్‌ లీజులు, 526 క్వారీ లీజులు ఉన్నాయి. అన్ని రకాల ఖనిజాలకు సీనరేజి వసూళ్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రకాల ఖనిజాలకు రాయల్టీ వసూలు కొన్ని రకాల శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకొని పరిశీలించింది. బిల్డింగ్‌ స్టోన్, రోడ్‌ మెటల్, బల్లాస్ట్, మొరం, గ్రావెల్‌ ఆర్డినరీ ఎర్త్‌ మినహా అన్ని రకాల మైనర్‌ మినరల్స్‌కు సీనరేజి రుసుం వసూలు, ఇతర చార్జీలు, పన్నుల వసూలు కోసం టోల్‌ వసూలు తరహా కాంట్రాక్టర్ల ఎంపికకు బిడ్స్‌ పిలిచింది.

జిల్లా పరిధిలో 272 క్వారీలు
జిల్లా పరిధిలో 272 క్వారీల నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇక సీనరేజి రుసుం వసూలు ప్రైవేటు వ్యక్తులే చేయనున్నారు. బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌ 141 లీజులు, బ్లాక్‌ గ్రానైట్‌ క్వారీ లీజులు 60, కలర గ్రానైట్‌ లీజులు 71 ఉన్నాయి. వీటి ద్వారా ఏటా భూగర్భ గనులశాఖ ఒంగోలు ఏడీ కార్యాలయం పరిధిలో రూ.360 కోట్లు, మార్కాపురం ఏడీ కార్యాలయం పరిధిలో రూ.3 కోట్లు రాయల్టీ ద్వారా ఆదాయం వస్తోంది. వీటికి 20 శాతం అదనంగా చేర్చి టెండర్‌ బిడ్‌ పిలిచినట్లు అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. జిల్లాలో అత్యధిక రాయల్టీ భూగర్భ గనుల శాఖ ఒంగోలు సహాయ సంచాలకుని కార్యాలయం పరిధిలోనే ఉంది. రాయల్టీ వసూలు ఇక ప్రైవేటు పరం కానున్న నేపథ్యంలో క్లస్టర్లను నిర్ణయించారు. ఒక వేళ జిల్లా మొత్తానికి ఒకే టెండర్‌ బిడ్‌ రాకపోతే క్లస్టర్లకు విడివిడిగా టెండర్లను పిలవడానికి వీలుగా క్లస్టర్లను నిర్ణయించారు. ఒంగోలు, మార్టూరు, మార్కాపురం, చీమకుర్తి క్లస్టర్లుగా నిర్ణయించినట్లుగా సమాచారం. గ్రానైట్‌ నుంచి మాత్రమే సీనరేజి వసూలు చేయాలని నిర్ణయించారు.

సీనరేజితో పాటు ఆదాయపన్ను, డిస్ట్రిక్ట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్, నెట్‌ చార్జీలు కూడా టెండర్‌ దక్కించుకున్న వారే వసూలు చేయాలి. కాంట్రాక్టర్ల ఎంపిక కోసం పేరొందిన సంస్థలు, వ్యక్తుల నుంచి డిపార్టుమెంట్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజి దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్‌ వేలం ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తారు. ప్రయోగాత్మకంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేశారు. ప్రకాశంలో గెలాక్సీ గ్రానైట్, కలర్, బ్లాక్‌ గ్రానైట్‌ ఖనిజాలు ఉన్నాయి. గెలాక్సీ మినహా కలర్, బ్లాక్, చిత్తూరు రెడ్‌ వంటి రకాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ వెబ్‌సైట్‌ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ ఎంఎస్‌టిసిఈసిఓఎంఎంఇఆర్‌సిఇ డాట్‌ కామ్‌) లేదంటే డిపార్టుమెంట్‌ ఆప్‌ మైన్స్‌ అండ్‌ జియాలజి వెబ్‌సైట్‌ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ ఎంఐఎన్‌ఈఎస్‌ డాట్‌ ఏపి డాట్‌ జీవోవి డాట్‌ ఇన్‌)లో వివరాలు పొందు పరిచారు. బిడ్స్‌ దాఖలు చేసేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉంది.

రూ.450 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం
జిల్లాలో చీమకుర్తి, బల్లికురవ, కనిగిరి, మార్టూరు ప్రాంతాల్లో గ్రానైట్‌ గనులు ఉన్నాయి. ఏటా ఒంగోలు, మార్కాపురం ఏడీ కార్యాలయం పరిధిలో రూ.380 కోట్ల వరకు రాయల్టీ రుసుం వసూలవుతోంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారుల నివేదికలో రాయల్టీ రూపంలో జమవుతున్నదాని కన్నా రెట్టింపు దొడ్డిదారిన పోతున్నట్లు అధికారులు గుర్తించారు. జాతీయ రహదారులపై టోల్‌ వసూలు విధానం తరహాలోనే గ్రానైట్‌ రాయల్టీ రుసుం వసూలుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా నుంచి రూ.450 కోట్లకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనాలు నెలకున్నాయి. జిల్లాలో ఇప్పటికే డిస్ట్రిక్ట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ రూ.558 కోట్లు ఉంది.

రూ.101.78 కోట్లతో 992 పనులు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 55 శాతం నిధులతో కమ్యూనిటీ బెన్‌ఫిట్‌ వర్కులు, 40 శాతం నిధులతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు నిధులు కేటాయించారు. కమ్యూనిటీ బెన్‌ఫిట్‌ విభాగంలో విద్య, అంగన్‌వాడీ భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ విభాగానికి, ఆరోగ్యం, తాగునీటి సరఫరాకు, పారిశుద్ధ్య పనులకు నిధులను కేటాయించారు. మిగిలిన 40 శాతం నిధులతో సిమెంట్‌ రహదారులు, మురుగునీటి పారుదలకు కాలువల నిర్మాణానికి, నీటిపారుదల రంగానికి నిధులు కేటాయించారు. ఇక మీదట డీఎంఎఫ్‌ చార్జీలు కూడా సంబంధిత కాంట్రాక్టర్లే వసూలు చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో గ్రానైట్‌ సీనరేజి ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రంగాల్లోని వ్యాపారులు సీనరేజి వసూలుకు ప్రభుత్వ మార్గదర్శకాల పరిశీలనలో నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు