అన్నదాత పై అ‘బీమా’నం

2 Aug, 2019 03:31 IST|Sakshi

ఖరీఫ్‌ నుంచే వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా అమలు 

రైతు రూపాయి కడితే చాలు 

రాష్ట్రంలో ఇప్పటికే 14.42 లక్షల మంది కర్షకులకు వర్తింపు 

బీమా ప్రీమియం కోసం బడ్జెట్‌లో రూ.1,163 కోట్లు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం రైతులకు ధీమా ఇస్తోంది. ప్రస్తుత ఖరీఫ్‌ నుంచే దీనిని అమలు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించగా.. పంటల్ని బీమా చేయించుకునే కర్షకుల సంఖ్య పెరుగుతోంది. ఈ పథకం కింద అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయే రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే వారి తరఫున బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానమంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై), ఆధునీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌) అమల్లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కొన్ని పంటలకు ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ పథకాన్ని అమలు చేస్తుండగా.. అన్ని జిల్లాలలో పీఎంఎఫ్‌బీవైని అమలు చేస్తున్నారు. రుణాలు పొందే రైతుల నుంచి బ్యాంకులే రూపాయి చొప్పున మినహాయించుకుని బీమా కంపెనీలకు చెల్లిస్తాయి. రుణాలు తీసుకోని రైతులు మీ సేవా కేంద్రంలో రూపాయి చెల్లించి రైతు పేరు, సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, భూమి వివరాలను నమోదు చేయించుకుంటే సరిపోతుంది. రైతుల తరఫున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,163 కోట్లను కేటాయించింది.

ప్రతి రైతుకూ లబ్ధి
పంటల వారీగా బీమా సంస్థలు నిర్ణయించిన ప్రకారం రైతులు ప్రీమియం విలువలో 2 నుంచి 5 శాతం సొమ్ము చెల్లిస్తే.. మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున చెల్లించేవి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు రైతులపై భారం పడకుండా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీనివల్ల రాష్ట్రంలో పంట వేసే ప్రతి రైతూ లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్రంలో 65 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో 15.36 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. రైతులతోపాటు కౌలు రైతుల తరఫున కూడా ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లిస్తుంది. బీమా ప్రీమియం చెల్లింపునకు తొలుత జూలై 31 వరకే గడువు విధించగా.. ఆగస్టు చివరి వరకు పొడిగించారు.

ఇప్పటికే 14.42 లక్షల మందికి వర్తింపు
రాష్ట్రంలో ఇప్పటివరకు పంటల బీమా చేయించుకున్న రైతుల సంఖ్య 14.42 లక్షలకు చేరిందని, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ చెప్పారు. ఉచిత బీమా పథకంలో చేరేందుకు రైతులు ఆసక్తి చూపడం శుభపరిణామమని పేర్కొన్నారు. రైతులు ఈ పథకాన్ని ఎంత వినియోగించుకుంటే అంత మంచిదన్నారు. కేవలం ఒక్క రూపాయితో బీమా పొందే సౌకర్యం దేశంలో బహుశా ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారి ప్రవేశపెట్టినట్టు వివరించారు.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా