ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలు

16 Jul, 2020 17:11 IST|Sakshi

సాక్షి, విజయవాడ: వైద్య ఖర్చులు రూ. వెయ్యిదాటితే ఇప్పటికే 1000 చికిత్సా విధానాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరో 87 చికిత్సా విధానాలు తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి గురువారం జారీ చేశారు. రూ. వెయ్యి నుంచి రూ. 47 వేల వరకు ఖర్చయ్యే 87 చికిత్సా విధానాలను కొత్తగా ఆరోగ్య శ్రీ పథకంలోకి చేర్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇందులో ఇన్ పేషెంట్‌కు అవసరమయ్యే 53 విధానాలతో పాటు, 29 స్వల్పకాలిక చికిత్సా విధానాలు, మరో 5 డేకేర్ విధానాలు ఉన్నాయి.(ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ విస్తరణ సేవలు ప్రారంభం)

కాగా వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీలో పలు మార్పులు చేసి తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు.  తాజాగా విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో  అమల్లోకి తీసుకు వచ్చేందుకు గురువారం శ్రీకారం చుట్టారు.

మరిన్ని వార్తలు