రాయలసీమకు ఏపీ సర్కారు అన్యాయం 

19 Nov, 2018 03:04 IST|Sakshi
క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న జస్టిస్‌ శేషశయనారెడ్డి, జస్టిస్‌ కృష్ణమోహన్‌రెడ్డి, జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఎ.హనుమంతరెడ్డి తదితరులు

జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సర్కారు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తోందని గ్రేటర్‌ రాయలసీమ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ(గ్రాట్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పి.లక్ష్మణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రేటర్‌ రాయలసీమ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బాచుపల్లి ఎక్స్‌రోడ్డులోని కొలను హన్మంత్‌రెడ్డి గార్డెన్స్‌లో జరిగిన కార్తీకమాస వనభోజన మహోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమాన్ని జస్టిస్‌ బి.శేషశయనారెడ్డి ప్రారంభించారు. జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు. సరైన నైపుణ్యాల్లేక ఉద్యోగాల సాధనలో విద్యార్థులు వెనకబడుతున్నారన్నారు.

విభజన తర్వాత టీడీపీ సర్కారు అభివృద్ధిని అన్నివిధాలా అమరావతికే పరిమితం చేసిందని పేర్కొన్నారు. ఎంతటి జబ్బు చేసి నా గతంలో ఆరోగ్యశ్రీ పథకం ఉండటంతో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుకు వెళ్లి చికిత్సలు చేయించుకొని నయం చేసుకొనేవారని, ఈ సదుపాయాన్ని టీడీపీ సర్కారు తొలగించి సీమవాసుల నడ్డి విరిచిందన్నారు. ఇప్పటికైనా ఏపీ సర్కారు ఆలోచించి ఆరోగ్యశ్రీని పాత పద్ధతిలోనే వర్తింపచేయాలని కోరారు. హైదరాబాద్‌లోని సీమవాసులకు అండదండగా ఉంటామని తెలిపారు.  

‘కృషి’లో ఉచిత శిక్షణ 
విశ్రాంత ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎ. హనుమంతరెడ్డి మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న రాయలసీమ వాసులందరం ఒక్కటై కష్టసుఖా లు పంచుకొంటూ ముందుకు సాగుదామని సూచించారు. విద్యార్థినీవిద్యార్థులకు ‘కృషి’విద్యాసంస్థలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు దోహదపడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. అనంతరం 2019 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జస్టిస్‌ బి.శేషశయనారెడ్డి, జస్టిస్‌ బి.క్రిష్ణమోహన్‌రెడ్డి, గ్రాట్‌ అధ్యక్షుడు ఎం.ఓబుళరెడ్డి, గ్రాట్‌ వ్యవస్థాపక ఉపాధ్యక్షురాలు ఎ.శ్యామలారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు