సెప్టెంబర్‌ 5 నుంచి.. ఇసుక కొత్త పాలసీ

5 Jul, 2019 04:16 IST|Sakshi
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక నూతన విధానంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజలకు భారం తగ్గింపు, సర్కారుకు ఆదాయం పెంపే లక్ష్యం

మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

ఏపీఎండీసీకి సరఫరా బాధ్యతలు

వాహనాలకు జీపీఎస్‌తో అక్రమ రవాణాకు అడ్డుకట్ట

క్వారీల్లో సీసీ కెమెరాలతో నిఘా

క్వారీలు, స్టాక్‌ యార్డుల్లో వేయింగ్‌ మిషన్లు

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి చేరనున్న ఇసుక

కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకూ సరఫరా బాధ్యత జిల్లా కలెక్టర్లదే

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కు పాదం

సాక్షి, అమరావతి: ప్రజలకు ప్రస్తుతం లభిస్తున్న దానికంటే తక్కువ ధరకే ఇసుకను అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక లభించేలా, సర్కారుకు ఆదాయం వచ్చేలా కొత్త విధానం ఉండాలని మార్గనిర్దేశం చేశారు. సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని సూచించారు. ప్రజలపై భారం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ రాబడి పెంపు, పారదర్శకత, అక్రమ రవాణాకు అడ్డుకట్ట లక్ష్యాలుగా ఇసుక కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా కలెక్టర్ల నేతృత్వంలో ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఎక్కడా ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక మాఫియాకు వరంగా మారిన గత ప్రభుత్వ ఇసుక విధానాన్ని రద్దు చేసిన నేపథ్యంలో కొత్త విధానం ఎలా ఉండాలనే అంశంపై మంత్రులు, ఉన్నతాధికారులతో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. తెలంగాణాతోపాటు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఇసుక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ప్రజలకు, ప్రభుత్వానికి పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా మన పాలసీ ఉండాలని సీఎం నొక్కి చెప్పారు. పర్యావరణానికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరుగకుండా చూడాలని సూచించారు.

ప్రతి వాహనానికీ జీపీఎస్‌
‘ఇసుకను తరలించే ప్రతి వాహనానికి తప్పనిసరిగా జీపీఎస్‌ పరికరాలు అమర్చాలి. దీనివల్ల వాహనం ఎక్కడి నుంచి ఎక్కడకు ఇసుకను తరలించిందో స్పష్టంగా తెలిసిపోతుంది. ఎక్కడా అక్రమాలకు అవకాశం ఉండదు. ఇసుక అక్రమ తవ్వకాలకు, రవాణాకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రజలకు ఎంత ధరతో ఇసుక అందుతుందో కచ్చితంగా అంతకంటే తక్కువ రేటుకే అందించాలి. ప్రభుత్వం సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి’ అని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

ఏర్పాట్లకు రెండు నెలల సమయం
ఎన్ని రోజుల్లో ఇసుక కొత్తవిధానం అమల్లోకి తేగలరని సీఎం అడిగిన ప్రశ్నకు క్వారీల వద్ద సీసీ కెమెరాలు, స్టాక్‌ యార్డులు, వేయింగ్‌ బ్రిడ్జిలు, వాహనాల గుర్తింపు, రిజిస్ట్రేషన్, జీపీఎస్‌.. తదితరాల ఏర్పాటుకు రెండు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. అందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి సెప్టెంబరు 5వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని, ఆ లోగా అన్నీ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇసుక కావాల్సిన వారు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడానికి వీలుగా ఒక యాప్, వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలని సూచించారు. డిమాండ్‌కు తగిన విధంగా ఇసుకను అందుబాటులో ఉంచి బుక్‌ చేసుకున్న వారికి సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకోవాలని నొక్కి చెప్పారు. ఇసుక సరఫరాకు కొత్త పాలసీ అమల్లోకి తెచ్చే వరకూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా ఇసుకను అందించే బాధ్యత జిల్లా కలెక్టర్లు యథాతథంగా చూసుకోవాలని ఆదేశించారు. ఇసుక డిమాండు – ఉత్పత్తి మధ్య అంతరం తగ్గించేందుకు రోబో శాండ్‌ను ప్రోత్సహించాలని సూచించారు.

సిలికా అక్రమ తవ్వకాలకు చెక్‌
నెల్లూరు జిల్లాలో సిలికా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్న అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు రాగానే సీఎం సీరియస్‌గా స్పందించారు. ఇసుకను అక్రమంగా తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత అధికారులంతా సమావేశమై అక్రమ తవ్వకాల నిరోధానికి గట్టి చర్యలు తీసుకోవాలని, అక్రమ తవ్వకాల మాట ఇక తనకు వినిపించరాదని ఆదేశించారు. గత అయిదేళ్లలో కోట్ల రూపాయల విలువైన ఇసుక కుంభకోణం సాగిందని సీఎం గుర్తు చేశారు. ఇసుక కొనుగోలు ప్రజలకు భారంగా మారగా, మాఫియా కాసుల మూటలు కొల్లగొట్టిందని, సర్కారుకు మాత్రం ఆదాయం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి వ్యవహరాలను ఇలాగే వదిలేస్తే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుందన్నారు. ఈ అక్రమాలకు చెక్‌ పెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి ఉభయతారకంగా మార్చడం కోసమే కొత్త ఇసుక పాలసీ తెస్తున్నామని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మేకతోటి సుచరిత, అనిల్‌ కుమార్‌ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం, భూగర్భ గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ శ్రీనరేష్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఏపీఎండీసీకే సరఫరా బాధ్యతలు
ఇసుక కొత్త విధానం మేరకు సరఫరా బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగిద్దామని అధికారులు చేసిన సూచనకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీని ప్రకారం ఏపీఎండీసీనే ప్రజలకు ఇసుకను విక్రయించనుంది. కొత్త విధానం అంతిమంగా ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా, పర్యావరణానికి నష్టం కలుగని రీతిలో, పూర్తి పారదర్శకంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక కొత్త విధానం ఇలా అమలు కానుంది.
► జిల్లాల్లో ఇసుక రేవులను గనుల శాఖ గుర్తిస్తుంది. వీటికి సమీపంలో ఏపీఎండీసీ నిల్వ కేంద్రాలు (స్టాక్‌ పాయింట్లు) ఏర్పాటు చేసుకుంటుంది.
► క్వారీల నుంచి ఇసుకను తవ్వించి వాహనాల్లో స్టాక్‌ పాయింట్లకు ఏపీఎండీసీనే చేరవేస్తుంది.
► క్వారీ వద్దకు రాగానే ఖాళీ వాహనం బరువును వేయింగ్‌ మిషన్‌ ద్వారా లెక్కిస్తారు. దాంట్లో ఇసుక నింపిన తర్వాత మళ్లీ బరువు చూస్తారు. దీంతో వాహనంలో ఎన్ని టన్నుల ఇసుక ఉందో తేలిపోతుంది. వాహనంలో ఎంత ఇసుక ఉందో డ్రైవరుకు చీటీ ఇచ్చి పంపుతారు. స్టాక్‌ యార్డులోని సిబ్బంది ఆ చీటీ తీసుకుని మళ్లీ తూకం వేసి అంతే పరిమాణంలో ఇసుక ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అన్‌ లోడ్‌ చేయిస్తారు.
► వినియోగదారులకు ఇసుక పంపేప్పుడు కూడా వాహనాలను తూకం వేసి కచ్చితంగా వారు కోరిన పరిమాణంలో పంపించే ఏర్పాటు చేస్తారు. దీనివల్ల క్వారీలో ఎన్ని టన్నుల ఇసుక తవ్వారు? స్టాక్‌ యార్డులకు ఎంత చేరింది? ఎంత విక్రయించారు? అనే లెక్క కచ్చితంగా ఉంటుంది. ఎక్కడా ఇసుక పక్కదారి పట్టడానికి  అవకాశం ఉండదు.
► ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేస్తారు.
► ఇసుక కావాల్సిన వారు వెబ్‌ పోర్టల్‌ ద్వారా ఇంటి నుంచే బుక్‌ చేసుకుని డబ్బు చెల్లిస్తే ఏపీఎండీసీనే ఇంటికి వాహనాల ద్వారా ఇసుకను చేరవేస్తుంది. ఏపీఎండీసీ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకుని జీపీఎస్‌ పరికరాలు అమర్చుకున్న వాహనాలను సంస్థ స్టాక్‌ యార్డుల వద్దకు అనుమతిస్తారు. ఎవరు ముందు బుక్‌ చేసుకుంటే వారికి ముందుగా పద్ధతిలో ఇసుకను పంపిస్తారు.

ఇసుక వ్యాపార వస్తువు కాకూడదు : మంత్రి పెద్దిరెడ్డి
సహజ సిద్ధమైన ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చరాదనేది ప్రభుత్వ లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇసుక ద్వారా ఆదాయం మాఫియాకు వెళ్లరాదని, ప్రజలకు సరసమైన ధరలకు అందించడం ద్వారా ఆదాయం ప్రభుత్వానికే రావాలన్నారు. గురువారం సాయంత్రం ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడారు. ఇసుక కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని చెప్పారు. 

ప్రభుత్వం ఇసుక సరఫరా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేటు పెరిగిందనే మాట ఎక్కడా ప్రజల నుంచి వినిపించకూడదు. అటు వినియోగదారులకు తక్కువ ధరకు అందేలా, ఇటు ప్రభుత్వ ఖజానాకు రాబడి వచ్చేలా కొత్త విధానం సమగ్రంగా పకడ్బందీగా ఉండాలి.

– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు