2016 టీటీడీ బోర్డు నిర్ణయం నిలుపుదల

25 May, 2020 21:33 IST|Sakshi

సాక్షి, తిరుమల: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది. 2016లో టీటీడీకి చెందిన 50 ఆస్తులు విక్రయించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, నాటి బోర్డు నిర్ణయాన్ని తాజా బోర్డుకు ఆపాదిస్తూ ఎల్లో మీడియా దుష్ర్పచారానికి తెరతీసింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ నిర్ణయాలు ఏవైనా స్వామీజీలు, ధార్మిక సంస్థలతో చర్చించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.
(చదవండి: ‘నిరర్థక’ నిర్ణయం టీడీపీ హయాంలోనే)

కాగా, నాటి టీటీడీ బోర్డు నిరర్థక ఆస్తుల విక్రయం నిర్ణయం.. అప్పటి పాలకమండలి చైర్మన్‌గా చదలవాడ కృష్ణమూర్తి ఉన్న సమయంలో జరిగింది. బోర్డు సభ్యులుగా ఉన్న బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రామోజీరావు బంధువు సుచరిత.. మరో ఇద్దరితో టీటీడీ ఆస్తుల విక్రయానికి సబ్‌కమిటీ ఏర్పాటైంది. దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు కూడా ఆస్తుల విక్రయానికి సంబంధించి మౌనం వహించారు. ఇదిలాఉండగా.. టీటీడీ గత బోర్డు నిర్ణయాన్ని ప్రస్తుత బోర్డుకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా ఎల్లో మీడియా, పచ్చపార్టీలు ఈ విషయమై రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఎల్లోమీడియా తానా అంటే కొన్ని పార్టీలు తందానా అంటున్నాయని ఎద్దేవా చేశారు.
(చదవండి: టీటీడీ ఆస్తుల వేలంపై నిర్ణయం తీసుకోలేదు)

>
మరిన్ని వార్తలు