ఇంగ్లిష్‌ మీడియంపై సిఫార్సులివ్వండి

3 May, 2020 02:56 IST|Sakshi

రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలికి ప్రభుత్వం ఆదేశం 

హైకోర్టు తీర్పును అనుసరించి ఇంగ్లిష్‌ మీడియంపై ఇప్పటికే తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ 

96.17 శాతం తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియానికే ఓటు

సాక్షి, అమరావతి: ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన అమలుపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) ప్రభుత్వానికి త్వరలోనే సిఫార్సులు అందించనుంది. వీటి ఆధారంగా ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో అత్యధికులు ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపిన దృష్ట్యా ఆ మాధ్యమం అమలుకు వీలుగా సిఫార్సులు అందించాలని ప్రభుత్వం ఎస్‌సీఈఆర్టీకి సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ శుక్రవారం ఉత్తర్వులు (జీవో–21) జారీ చేశారు.

ఆంగ్ల మాధ్యమం అమలుపై హైకోర్టు తీర్పు మేరకు ఏపీ విద్యా చట్టం (ఎడ్యుకేషన్‌ యాక్ట్‌)లోని సంబంధిత సెక్షన్లను అనుసరించి ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని జీవోలో పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో గతంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి అమలు చేసిన తీరు, అందుకు దశలవారీగా తీసుకున్న చర్యలకు సంబంధించిన అంశాలను కూడా నివేదికల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌తో పాటు విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)లోని సంబంధిత అవకాశాలను కూడా పరిశీలించి సిఫార్సుల్లో పొందుపర్చాలన్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వివరించారు.

ఆంగ్ల మాధ్యమం వైపు తల్లిదండ్రుల మొగ్గు
► ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 81, 85లను రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
► అకడమిక్‌ అంశాలపై అధికారాలు ఎస్‌సీఈఆర్‌టీవేనని, విద్యాహక్కు చట్టం ప్రకారం అకడమిక్‌ వ్యవహారాల్లో ఎస్‌సీఈఆర్టీ ప్రమేయం లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తీర్పులో పేర్కొంది.
► అదే సమయంలో నిర్ణయం తీసుకునే ముందు మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తీర్పులో అభిప్రాయపడింది.
► ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం (2020–21)లో తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారనే దానిపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
► ఈ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించిన కమిషనర్‌ ప్రభుత్వానికి నివేదించారు. 
► 1 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న 17,87,035 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆప్షన్లు కోరగా.. 17,85,669 మంది నుంచి ఆప్షన్లు అందాయి.
► 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమం.. 3.05 శాతం మంది తెలుగు మాధ్యమం, 0.78 మంది ఇతర మైనర్‌ మాధ్యమాలు కావాలని ఆప్షన్లు ఇచ్చారు.
► హైకోర్టు తీర్పును అనుసరించి నిర్వహించిన ఆప్షన్ల సేకరణలో మాధ్యమంపై పిల్లలు/తల్లిదండ్రుల అభిప్రాయాలు ఇలా ఉన్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై తగిన సిఫార్సులు అందించాలని ప్రభుత్వం ఈ జీవోలో ఎస్‌సీఈఆర్టీని కోరింది. 

మరిన్ని వార్తలు