బంధువుకు టీటీడీ నిధుల విందు!

2 Dec, 2018 09:44 IST|Sakshi
తిరుపతిలో అవిలాల చెరువు

తిరుపతిలో అవిలాల చెరువు పనుల వ్యయం అడ్డంగా పెంపు

రూ. 18.5 కోట్ల పనులు..రూ. 181.13 కోట్లకు..

సమీప బంధువుకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు వ్యూహం

టీటీడీ నిధులు మళ్లించి పనులు చేపట్టేందుకు ప్రణాళిక

సుప్రీం, హైకోర్టు ఆదేశాలు బేఖాతరు

నిధులు ఇచ్చేందుకు అంగీకరిస్తూ టీటీడీ తీర్మానం 

సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) నిధులను మళ్లించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టినా, చిన్న నీటివనరుల మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయకూడదన్న సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇచ్చినా.. సీఎం చంద్రబాబునాయుడుకు చీమకుట్టినట్లయినా లేదు. నిబంధనలకు విరుద్ధంగా తిరుపతిలో అవిలాల చెరువును పర్యాటక కేంద్రంగా మార్చడానికి పూనుకున్నారు. ఈ పనులను రూ.18.50 కోట్లతో చేపట్టడానికి అనుమతి ఇస్తూ సెప్టెంబర్‌ 11, 2017న దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ చంద్రబాబు ఒత్తిడి మేరకు ఈ పనుల అంచనా వ్యయం ఒక్కసారిగా రూ. 181.13 కోట్లకు పెరిగింది. ఈ నిధులను టీటీడీయే సమకూర్చేలా చక్రం తిప్పారు. తన సమీప బంధువుకు పనులు అప్పగించి భారీఎత్తున దోచుకోవడానికి పావులు కదిపారు. నిబంధనల ప్రకారం శ్రీవారి సేవలు, హిందూ ధార్మిక కార్యక్రమాలు, దేవాయాల జీర్ణోద్ధరణ, తిరుమల తిరుపతిలో భక్తులకు సౌకర్యాలు కల్పించడానికే టీటీడీ నిధులు ఖర్చు చేయాలి. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి సుందరీకరణకు టీటీడీ ఖజానా నుంచి రూ. 10 కోట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన యత్నాన్ని ఏడాదిన్నర క్రితం హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. టీటీడీ నియమావళిని తుంగలో తొక్కుతూ శ్రీవారి నిధులను ఎలా మళ్లిస్తారంటూ నిలదీసింది. దాంతో సర్కార్‌ ప్రయత్నానికి బ్రేక్‌ పడింది. తాజాగా టీటీడీ ఖజానా నుంచి రూ. 181.13 కోట్లను మళ్లించేందుకు సిద్ధమవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

బంధువుకు దోచిపెట్టేందుకు ‘ప్లాన్‌’..

అవిలాల చెరువు పనులు తన సమీప బంధువైన కాంట్రాక్టర్‌కు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు టీటీడీ అధికారవర్గాలు చెప్పాయి. చెరువు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీయూజీ అండ్‌ బీసీఎల్‌)కు అప్పగించారు. రూ.181.13 కోట్ల అంచనాతో ఆ సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించి ఈ ఏడాది మే 29న రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. జూలై 4, 2018న సీఎం చంద్రబాబు ఈ మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదముద్ర వేశారు. మాస్టర్‌ ప్లాన్‌ను రెండు దశల్లో అమలు చేయాలని.. తొలి దశలో రూ. 80.14 కోట్లు, రెండో దశలో రూ.100.99 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసమైన నిధులను టీటీడీ నుంచి కేటాయించేలా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలంటూ టీటీడీ బోర్డుపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు టీటీడీ అంగీకరిస్తూ జూలై 24న టీటీడీ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అవిలాల చెరువును టీటీడీకి బదలాయించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ జలవనరుల శాఖపై.. అలాగే  రూ.181.13 కోట్ల టీటీడీ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయాలంటూ దేవాదాయ శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. జలవనరులు, దేవాదాయ శాఖ అంగీకరించిన వెంటనే.. పనులు చేపట్టేందుకు వీలుగా ఏపీయూజీ అండ్‌ బీసీఎల్‌తో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించి.. సమీప బంధువుకు ఆ పనులను కట్టబెట్టడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. 

సుప్రీం తప్పుపట్టినా.. 

తిరుపతి సమీపంలోని అవిలాల చెరువును తుడా(తిరుపతి పట్టణాభివద్ధి సంస్థ)కు బదలాయిస్తూ జనవరి 28, 1994న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న నీటి వనరుల మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తున్నారంటూ ‘మేధావుల ఫోరం’ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం కోర్టు అవిలాల చెరువును నీటిపారుదల శాఖ పరిధిలోకే తేవాలని ఫిబ్రవరి 23, 2006న తీర్పు ఇచ్చింది. 


ఇదిలా ఉండగా మే 21, 2017న సీఎం చంద్రబాబు తిరుమలలో నిర్వహించిన సమీక్షలో అవిలాల చెరువును పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పనులు చేపట్టడానికి రూ.18.50 కోట్లతో టీటీడీకి అనుమతి ఇస్తూ సెప్టెంబర్‌ 11, 2017న దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  


 

మరిన్ని వార్తలు