ఎదురుచూపులకు ఏడాది!

10 Mar, 2018 11:46 IST|Sakshi
కోవెలకుంట్లలోని స్వామినగర్‌లో బిల్లు అందక నిర్మాణం నిలిచిపోయిన ఎన్టీఆర్‌ గృహం

ఎన్టీఆర్‌ గృహాలకు విడుదల కాని నిధులు

నిలిచిపోతున్న నిర్మాణాలు

మహా శంకుస్థాపనల పేరుతో సర్కారు ఆర్భాటం

లబ్ధిదారులకందని మెటీరియల్, ఉపాధి నిధులు

పేదల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతోంది. ఇళ్ల నిర్మాణాలు చేపట్టినవారికి బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తోంది. మరోవైపురాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికిమహా శంకుస్థాపన పక్షోత్సవాల
పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది.  ఎన్టీఆర్‌ రూరల్, ఎన్టీఆర్‌గ్రామీణ్, ఎన్టీఆర్‌ అర్బన్‌ కింద జిల్లాకు   మొదటి, రెండో విడతల్లో మంజూరైన64,600 ఇళ్లలో ఇప్పటి వరకు సగంకూడా పూర్తికాలేదు. మరికొన్నింటినిర్మాణాలే మొదలు కాలేదు.

కోవెలకుంట్ల:   తెలుగుదేశం ప్రభుత్వం  వచ్చాక ఇందిరమ్మ పథకానికి స్వస్తి చెప్పి  ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశ పెట్టింది.  ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ. 1.50 లక్షలు, ఎన్టీఆర్‌ గ్రామీణ పథకం కింద రూ. 2లక్షలు, ఎన్టీఆర్‌ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద రూ. 3.50 లక్షలు ఒక్కో గృహ నిర్మాణానికి కేటాయించింది. ఇందుల్లో మెటీరియల్, లేబర్, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి సంబంధించి కేంద్రప్రభుత్వం నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ నిధుల్లో రూ. 23వేలు మెటీరియల్, రూ. 18వేలు లేబర్‌ బిల్లులు, రూ. 15వేలు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి   ఉపాధి హామీ పథకం కింద నిధులు అందజేయాలి.  ఎన్టీఆర్‌ పథకం కింద  నిర్మిస్తున్న గృహాలను చంద్రన్న ఇస్తున్న అపురూప బహుమానం పేరుతో ఆర్భాటం చేస్తుండటంతో కేంద్రం వాటికి  ఇవ్వాల్సిన నిధులు చెల్లించకుండా పెం డింగ్‌లో పెట్టినట్లు సమాచారం.  ఇప్పటికే నిర్మాణాలు పూర్తి అయిన 20 వేల గృహాలకు సంబంధించి రూ. 50 కోట్ల మేర బిల్లులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకున్న పేద కుటుంబాలకు నిరాశే మిగిలింది.  పూర్తి స్థాయిలో గృహం నిర్మించుకున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మొదటి విడతలో మంజూరైన గృహ నిర్మాణాలను పూర్తిచేసి ఏడు నెలలుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు.  ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ. 1.50 లక్షలు అందాల్సి ఉండగా లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వానికి సంబంధించిన మెటీరియల్, లేబర్‌ బిల్లులు విడుదల కాలేదు. బిల్లులు వస్తాయనే ఆశతో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చుకుని  నిర్మాణాలు చేపట్టి ఇప్పుడు  ప్రభుత్వ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తీసుకున్న అప్పు చెల్లించాలని రుణదాతల నుంచి వారికి ఒత్తిడి అధికమైంది. మరోవైపు రెండవ విడతలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బిల్లులు కూడా సక్రమంగా అందలేదు. ఇప్పటికైనా  ప్రభుత్వం స్పందించి  బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు