‘వయసులో చిన్నవాడైనా నాకు అవకాశం కల్పించాడు’

15 Dec, 2019 14:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 67వ వర్ధంతి సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, తెలుగు అకాడమీ చైర్మన్‌ నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు గారి వర్థంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పొట్టి శ్రీరాములు మనుమరాలిని పిలిచి సన్మానించిన  వ్యక్తి  మన ముఖ్యమంత్రి గారని కొనియాడారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించడం, పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం ముదావహమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములని వ్యాఖ్యానించారు.  గత ప్రభుత్వం  ఆయన త్యాగాన్ని విస్మరించిందని విమర్శించారు. పొట్టి శ్రీరాములు పేరిట తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌దని గుర్తు చేశారు. ఆయన వద్ద అధికారాన్ని లాక్కున్న చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగించారని మండిపడ్డారు. సీఎం జగన్‌ వయసులో చిన్నవాడైనా త్యాగధనులను గుర్తించి స్మరించుకునే అవకాశం కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. .పట్టుదల, నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన పొట్టి శ్రీరాములు భావితరాలకు స్పూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు