విశాఖ మెట్రో: ట్రామ్ కారిడార్‌ డీపీఆర్‌కు ఆదేశాలు

1 Jun, 2020 18:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విశాఖ మెట్రోలో భాగంగా ట్రామ్ కారిడార్ నిర్మాణానికి మరో అడుగు పడింది. ట్రామ్‌ కారిడార్‌ తయారీని అర్బన్‌ మాస్‌ ట్రాన్సిట్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఎంటీసీ‌) దక్కించుకుంది. విశాఖ మెట్రో రీజియన్ పరిధిలోని 60.20 కిలోమీటర్ల ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు డీటేయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు  సిద్ధం చేయాలని ప్రభుత్వం యూఎంటీసీఎల్‌కు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, దేశంలోని మిగతా మెట్రో సర్వీసుల మాదిరిగా కాకుండా.. విశాఖ మెట్రోకు అంతర్జాతీయ లుక్‌ రావాలన్న కాంక్షతో.. ట్రామ్‌ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మెట్రో రైలు.. రద్దీ తక్కువగా ఉండే  పెందుర్తి, బీచ్‌రోడ్డు వంటి ప్రాంతాల్లో ట్రామ్‌ కార్లు ఏర్పాటు చేయనున్నారు.

ట్రామ్‌ కార్‌ అంటే..?
విద్యుదయస్కాంత శక్తితో నడిచే ట్రాక్‌లెస్‌ రైలు వ్యవస్థనే ట్రామ్‌ కార్‌ అని పిలుస్తారు. ప్రత్యేకంగా రైలు ట్రాక్‌ మార్గం అనేది లేకుండానే రోడ్లపైనే ప్రయాణించడం ట్రామ్‌కార్‌ ప్రత్యేకత. ఒక లగ్జరీ బస్‌ మాదిరిగానే ఈ ట్రామ్‌కార్‌ ఉంటుంది. 300 నుంచి 500 వరకూ ప్రయాణించవచ్చు. ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరానికి తగ్గట్టుగా దారిలో ఉన్న స్టేషన్‌లో అదనపు బోగీ అనుసంధానం చేసేలా వ్యవస్థ ఉండటం దీని ప్రత్యేకత. అందుబాటులో ఉన్న రోడ్లపై సెన్సార్‌ సిగ్నల్‌ విధానంతో వర్చువల్‌ ట్రాక్‌ ఆధారంగా ట్రామ్‌ నడుస్తుంది. బీచ్‌ రోడ్డుపై ట్రామ్‌కార్‌లో ప్రయాణిస్తుంటే విదేశాల్లో విహరిస్తున్న మధురానుభూతికి ప్రయాణికులు లోనవుతారు.
(చదవండి: విశాఖపై అభివృద్ధి సంతకం)

మరిన్ని వార్తలు