కొరత లేకుండా ఇసుక 

10 Aug, 2019 12:07 IST|Sakshi

ప్రణాళిక రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం 

విశాఖ జిల్లాకు శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల్లో రీచ్‌లు 

ప్రకాశం జిల్లాకు నెల్లూరు జిల్లాలో క్వారీలు కేటాయింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత లేకుండా అవసరమైనంత మేర అందుబాటులో ఉంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాధారణంగా వర్షాల సమయంలో నదుల్లో నీరు ప్రవహించడం వల్ల రీచ్‌లలో ఇసుక తవ్వకం సాధ్యం కాదు. దీంతో ఇసుక కొరత ఏర్పడుతోంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల నిర్మాణాలకు ఇసుక దొరకడం లేదన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో పరిస్థితి చక్కదిద్ది, ప్రజలకు సులభంగా ఇసుకను అందుబాటులో ఉంచడానికి ప్రణాళికను రూపొందించింది. విశాఖ, ప్రకాశం జిల్లాల్లో పెద్ద నదులు లేకపోవడం వల్ల స్థానికంగా ఇసుక కొరత తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విశాఖ జిల్లాకు శ్రీకాకుళం జిల్లాలోని పురుషోత్తపురం, తూర్పుగోదావరి జిల్లాలోని కేతవానిలంక డీసిల్టేషన్‌ పాయింట్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ రెండు చోట్ల  మొత్తం 1,75,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల అవసరాల కోసం నెల్లూరు జిల్లా బుచి్చరెడ్డిపాలెం మండలంలోని మినవాగు ఇసుక రీచ్‌ను కేటాయించింది. ఇక్కడ 28,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది.

ఇతర రాష్ట్రాల నుంచి ఎంతైనా తెచ్చుకోవచ్చు: 
ఏపీ నుంచి ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించడానికి వీల్లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతైనా ఇసుక తెచ్చుకోవచ్చు. ఒడిశాలో ఇసుక భారీగా అందుబాటులో ఉంది. అక్కడి నుంచి ఎవరు ఇసుక తెచ్చుకున్నా చెక్‌పోస్టుల్లో అభ్యంతరం పెట్టరు. ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎవరు ఇసుక తెప్పించుకున్నా అడ్డుకోవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ‘‘మన రాష్ట్రంలో భవిష్యత్తులో ఇసుక కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఇతర రాష్ట్రాలకు ఇసుకను రవాణా చేయడంపై నిషేధం ఉంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఇసుక తెప్పించుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవు’’’ అని భూగర్భ గనుల శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు.  

దూరాన్ని బట్టి ధర నిర్ణయం : 
రాష్ట్రంలో సెప్టెంబర్‌ 5వ తేదీన కొత్త విధానం అమల్లోకి రానుంది. నిర్మాణాలకు ఇసుక అవసరమైన వారు అధికారులకు దరఖాస్తు చేసి, పరి్మట్లు తీసుకుని తెచ్చుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కొందరు వ్యక్తులు ఇసుక కొరత ఏర్పడిందని ప్రచారం చేసి, అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచి్చంది. ఈ పరిస్థితి ఎక్కువగా విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించింది. అందుకే సమీపంలోని జిల్లాల్లో రీచ్‌లు కేటాయించింది. లారీ ఇసుకకు లోడింగ్, అన్‌లోడింగ్‌ చార్జీలు, క్వారీ నుంచి ఎంత దూరం ఉందో లెక్కగట్టి రవాణా వ్యయాన్ని నిర్ణయించి అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. దూరాన్ని ధర ఎంత ఉండాలో నిర్ణయించి, అమలు చేసేలా చూడాలని భూగర్భ గనుల శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.   

మరిన్ని వార్తలు