పన్ను ఎగవేతదారుల పప్పులుడకవు

22 Jun, 2020 04:19 IST|Sakshi

వారిని గుర్తించేందుకు ఏపీఎస్‌డీఆర్‌ఐ ఏర్పాటు

రాష్ట్రంలో రెవెన్యూ లీకేజీపై నిఘా

జీఎస్‌టీ, ఎక్సైజ్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్, రవాణా, గనుల ఆదాయంపై ప్రత్యేక దృష్టి

కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి

పన్నులు తక్కువ చేసి చూపించే ఉద్యోగులపై కఠిన చర్యలు

ఇటీవలే కేబినెట్‌ ఆమోదం.. నేడో రేపో ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇకపై పన్ను ఎగవేతదారుల ఆటలు సాగవు. వీరికి కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీఎస్‌డీఆర్‌ఐ) విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తోంది. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలుపగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడో రేపో జారీకానున్నాయి. ఏపీఎస్‌డీఆర్‌ఐ ప్రధానంగా జీఎస్‌టీతో పాటు ఎక్సైజ్, స్టాంప్స్‌ అండ్‌ రిజస్ట్రేషన్స్, రవాణా, గనుల ఆదాయంలో లీకేజీ నివారణే లక్ష్యంగా పనిచేయనుంది. వివిధ రంగాల్లో పన్ను ఎగవేతదారులను గుర్తించడంతో పాటు ఎగవేసిన పన్నును రాబట్టేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటుంది. అంతేకాక.. పన్ను ఎగవేతకు లేదా తక్కువ పన్ను చెల్లించేందుకు సహకరించే అధికారులు, ఉద్యోగులను గుర్తించి వారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తుంది. జీరో వ్యాపారం చూపెట్టి పన్ను ఎగవేయడం, పన్ను మదింపు తక్కువగా చేయడం, వ్యాపారం చేయకపోయినప్పటికీ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్స్‌ చేయడం వంటి వాటిపై నిరంతరం నిఘా పెట్టనుంది.

ఏపీఎస్‌డీఆర్‌ఐ విధులు ఇలా.. 
► అన్ని రకాల పన్ను ఎగవేతలను ఇంటెలిజెన్స్‌ మార్గంలో సమాచారాన్ని సేకరిస్తుంది. 
► వాణిజ్య పన్నులు, సీఎస్‌టీ, ఎక్సైజ్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్, రవాణా, మినరల్స్‌ రాయల్టీ, పన్నేతర రెవెన్యూలపై సంబంధిత శాఖల రికార్డులు, ఫిర్యాదులు, ఇతర మార్గాలతో పాటు క్రమబద్ధమైన సర్వే ద్వారా పన్ను వసూళ్ల సమాచారాన్ని రాబడుతుంది. 
► రాష్ట్రంలో పన్ను వసూళ్ల తీరు తెన్నులు, లీకేజీపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు ఆ సమాచారాన్ని ఆయా శాఖలకు ఎప్పటికప్పుడు పంపిస్తుంది. 
► పన్ను ఎగవేతదారులను గుర్తించి వారికి షోకాజ్‌ నోటీసులు జారీచేసి దర్యాప్తు చేస్తుంది. అంతేకాక.. ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలకు పంపిస్తుంది.  
► చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎగవేసిన పన్నును పూర్తిగా రాబడతారు. ఇలాంటి కేసులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. 
► కేంద్ర డైరెక్టర్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్, సెబీ, పోలీసు, సీబీఐ, ఆదాయపు పన్ను విభాగాలతో ఎప్పటికప్పుడు పన్నులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంది. 
► రాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు ఆయా రాష్ట్రాల రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంది. 
► పన్ను ఎగవేతల్లో ప్రభుత్వోద్యోగులు, అధికారులు భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం లభిస్తే తదుపరి దర్యాప్తునకు సిఫార్సు చేస్తుంది. పన్నుల ఎగవేతను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యవస్థలో మార్పులతో పాటు ఐటీ వ్యవస్థను మెరుగుపర్చడంపై తగిన సూచనలు చేస్తుంది. 
► వివిధ రకాల పన్ను రాయితీలు, మినహాయింపుల్లో అక్రమాలకు, దుర్వినియోగానికి పాల్పడినట్లు సమాచారం ఉంటే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సులు చేస్తుంది. 
► పన్ను ఎగవేత, లీకేజీలపై కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్, అకౌంటెంట్‌ జనరల్‌ నివేదికల్లోని అంశాలపై దృష్టిసారించడంతో పాటు రెవెన్యూ లీకేజీ నివారణకు అవసరమైన చర్యలను సూచిస్తుంది.

మరిన్ని వార్తలు