ఐదేళ్లలో టాప్‌–5లోకి..

2 Nov, 2019 04:28 IST|Sakshi

ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ప్రస్తుతం 135 బిలియన్‌ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 

2024–25 నాటికి 320 బిలియన్‌ డాలర్లకు చేర్చాలన్నదే లక్ష్యం 

ప్రస్తుతం జీడీపీ ప్రకారం ఏడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌.. మొదటి స్థానంలో మహారాష్ట్ర

సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతమున్న 2.6 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 2024–25 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రధాని లక్ష్యంతో స్ఫూర్తి పొందిన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీ లక్ష్యాలను నిర్దేశించుకొని కీలక రాష్ట్రంగా ఎదగాలనే కృతనిశ్చయంతో ఉంది. వచ్చే ఐదేళ్లలో టాప్‌–5లో చేరాలనే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం దేశ ఆరి్థక వ్యవస్థలో కేవలం 9 రాష్ట్రాలే కీలకపాత్ర పోషిస్తున్నాయి.

మహారాష్ట్ర అత్యధికంగా రూ.26 లక్షల కోట్ల జీఎస్‌డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి)తో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (రూ.16.64 లక్షల కోట్లు), ఉత్తరప్రదేశ్‌ (రూ.15.42 లక్షల కోట్లు), కర్ణాటక (రూ.15.35 లక్షల కోట్లు), గుజరాత్‌ (రూ.13.14 లక్షల కోట్లు) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రూ.9.33 లక్షల కోట్లతో ఏడో స్థానంలో ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో మహారాష్ట్ర, ఢిల్లీలు మొదటి రెండు స్థానాల్లో ఉంటే మన రాష్ట్రం రూ.2.20 లక్షల కోట్లతో ఆరో స్థానంలో ఉంది. జీడీపీ, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ ముందు ఉండటం గమనార్హం.  

కీలక రాష్ట్రాలపై కేంద్రం దృష్టి 
ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలనే పట్టుదలతో ఉండటంతో జీడీపీలో కీలక రాష్ట్రాలపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పోర్టు ఆధారిత బ్లూ ఎకానమీ, ఫార్మా, పెట్రోకెమికల్స్‌ వంటి రంగాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండంకెల వృద్ధిరేటుతో పయనిస్తున్న రాష్ట్రం వచ్చే ఐదేళ్లలో సగటున 25 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తే కానీ భారీ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. దీంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఫ్రాతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)పై అత్యధికంగా దృష్టిపెట్టాలని నిర్ణయించింది.

రాష్ట్ర జీడీపీలో ప్రస్తుతం సుమారు 15 శాతంగా ఉన్న ఎంఎస్‌ఎంఈ రంగ వాటాను వచ్చే ఐదేళ్లలో 30–35 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా క్లస్టర్‌ విధానంలో ప్రతి జిల్లాలో కనీసం 100 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను నిర్మించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో నౌకాశ్రయాలు, విమానాశ్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా భావనపాడు, బందరు, రామాయపట్నం పోర్టులకు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా త్వరితగతిన ఈ మూడింటినీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఆక్వా ఎగుమతులను పెంచడానికి రాష్ట్రవ్యాప్తంగా 46 ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. త్వరలో విడుదల చేసే నూతన పారిశ్రామిక పాలసీల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దడం ద్వారా 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీలో కీలక రాష్ట్రంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
దేశ జీడీపీలో మన రాష్ట్రం ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో టాప్‌–5లో చోటు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనికి కేంద్రం ఎలాంటి సహాయసహకారాలు అందిస్తుందో తెలుసుకునేందుకు త్వరలో కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో చర్చించనున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగా గత ప్రభుత్వం చెల్లించని పారిశ్రామిక రాయితీల బకాయిలను తీర్చాలని నిర్ణయించాం. అదేవిధంగా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందించడానికి నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయంతోపాటు ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక నైపుణ్యాభివృద్ధి కళాశాలను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో అటల్‌ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రూ.24 వేల కోట్లతో స్వర్ణ చతుర్భుజి పేరుతో మొదలుపెట్టిన జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్ట్‌ దేశ జీడీపీని పరుగులు పెట్టించింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో కేంద్రం భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను చేపడితే లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతాం. 
– మేకపాటి గౌతమ్‌ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు