‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవ్వండి

28 Dec, 2019 04:56 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశం

త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌

ఓటర్ల జాబితా, బ్యాలెట్‌ బాక్సుల్ని సిద్ధం చేసుకోవాలని సూచన

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని.. ఇందుకు యంత్రాంగాన్ని సర్వసన్నద్ధంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్  ఆదేశించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఓటర్ల జాబితాలు, బ్యాలెట్‌ బాక ్స్‌ల వంటి ఎన్నికల సామగ్రిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని కమిషనర్‌ సూచించారు. ప్రతి గ్రామానికి, ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి 70 కాపీల వరకు ఓటర్ల జాబితాల అవసరం ఉంటుందని, ఆ మేరకు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

విడతల వారీగా ఎన్నికలు జరిపినప్పటికీ, రాష్ట్రంలో సరిపడినన్ని బ్యాలెట్‌ బాక్స్‌లు అందుబాటులో లేని కారణంగా కేరళ నుంచి రప్పిస్తున్నట్లు వివరించారు. పోలింగ్‌ బూత్‌ గుర్తింపు, సిబ్బంది నియామకంలో ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఏవీ సత్య రమేష్‌ పాల్గొనగా.. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఆర్డీవోలు, ఎన్నికల విధుల్లో ఉండే ఇతర అధికారులు హాజరయ్యారు.

పరీక్షలకు ఆటంకం లేకుండా ఎన్నికల తేదీలు
మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నందున వాటికి ఆటంకం కలగకుండా ఎన్నికల తేదీలు ఖరారు చేసే అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌  రమేష్‌కుమార్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, విద్యా శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఏయే తేదీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉన్నాయో విద్యా శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలేజీలు, స్కూళ్లలో పోలింగ్‌తో పాటు ఎన్నికల కౌంటింగ్‌ వల్ల విద్యార్థులకు ఆటంకం కలిగే పరిస్థితి ఉంటే.. అలాంటి విద్యా సంస్థలను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు నిధుల విడుదలలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను కోరారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా