ఇక పరిషత్‌ పోరు షురూ!

22 Jun, 2019 09:26 IST|Sakshi

సార్వత్రిక పోరు ముగిసింది. వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించింది. పాలనలో తమ మార్కుచూపిస్తూ గెలిపించిన జనానికి న్యాయం చేస్తోంది. ఇప్పుడు స్థానిక పోరుకు యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ సారీ విజయోత్సాహంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కదన రంగంలోకి దిగేందుకు పోటీపడుతుంటే... పరాజయ భారంతో జనానికి దూరమైన టీడీపీ ఈ సారి అభ్యర్థులకోసం అన్వేషణ మొదలుపెట్టింది. సీనియర్లు పోటీకి విముఖత చూపుతుంటే... కొత్తముఖాలతో ఉనికి చాటుకోవాలనే యోచనతో పార్టీ జిల్లా నాయకత్వం యోచిస్తోంది.

సాక్షి, విజయనగరం : పంచాయతీరాజ్‌తో పాటు, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలకు, నెల్లిమర్ల నగర పంచాయతీకి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. గత నెల 20న పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రచురించిన అధికారులు ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా రిజర్వేషన్లు, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ప్రక్రియను జూలై 3వ తేదీకల్లా పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో జూలై 4తో జిల్లా పరిషత్‌ పాలకవర్గం గడువు ముగియనుంది.

920 పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి కూడా త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాననుసరించి మున్సిపల్, పంచాయతీరాజ్‌ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు తయారుచేస్తున్నారు. వాటిని జిల్లా పరిషత్, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ప్రదర్శనకు కూడా ఉంచనున్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు పరిషత్‌ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన టీడీపీ నుంచి బరిలో దిగేందుకు సిట్టింగ్‌లు, సీనియర్లు వెనకంజ వేస్తున్నారు. కొత్త ముఖాలను తెరపైకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యం
1979లో ఏర్పడ్డ విజయనగరం జిల్లా పరిషత్‌లో ప్రస్తుతం 34 జెడ్పీటీసీ, 549 ఎంపీటీసీ స్థానా లున్నాయి. 2014 జూలై నెల 4వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. వీరి పదవీకాలం ఈ జూలై 4వ తేదీతో ముగియనుంది. గడిచిన ఈ ఐదేళ్ల కాలంలో జిల్లా పరిషత్‌కు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.21.71 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 18 కోట్లు, తాగునీటి పథకాల నిర్వహణకు రూ.21 కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తం నిధులు ఖర్చయిపోయాయి. కానీ అభివృద్ధి ఎక్కడా కానరాలేదు. ఇక జిల్లా పరిషత్‌ పాలక వర్గంపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకుని అధిక సంఖ్యలో అక్రమ డిప్యూటేషన్లు వేశారనేది వాటిలో ఒకటి. ఎంపీడీఓలుగా టీడీపీకి అనుకూలంగా ఉన్నవారిని నియమించారు. సొంత మండలానికి చెందిన వారిని అదే మండలం ఎంపీడీఓగా నియమించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా వ్యవహరించారు. రూ.40 లక్షలతో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నివాసగృహం ఒకటి కట్టించారు. శిక్షణ భవనం నిర్మించారు. అంతకు మించి చేసిందేమీ లేదు. 

నిస్తేజంలో టీడీపీ కేడర్‌
2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని విజయనగరం పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత జిల్లా టీడీపీ దిక్కులేకుండా ఉంది. పార్టీకి పెద్ద దిక్కుగా భావించే కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు కూడా పార్టీని పట్టించుకోలేదు. బొబ్బిలి రాజైన రాష్ట్ర మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఎన్నికల తర్వాత ఇంత వరకూ పార్టీ కేడర్‌ను కలవనే లేదు. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన కురుపాం రాజు వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్‌ ఓటమి తర్వాత పత్తాలేకుండా పోయారు.

మిగిలిన నియోజకవర్గాల్లోని పరాజిత నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లి భవిష్యత్‌ను చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్టు ఆశించి భంగపడ్డారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకు, జిల్లా పరిషత్‌ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని జిల్లాలో నడిపించే నాథుడు లేకుండా పోయాడు. పార్టీ అధిష్టానం చెప్పడంతో కొందరు నేతలు కనీసం పోటీకి అభ్యర్థులనైనా చూడాలని భావించి వారి కోసం వెదుకుతున్నారు. సిట్టింగ్‌లు, సీనియర్లు వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ముందు ఓటమి తప్పదని భయపడి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

రాజకీయాల్లోకి కొత్తగా రావాలనుకుంటున్నావారిని, తొలిసారి పోటీలో నిలవాలనుకునేవారిని బరిలోకి దింపాలనుకుంటున్నారు. వారైతే ఓడిపోయినా పెద్దగా బాధపడాల్సిన అవసరం ఉండదనేది సీనియర్ల ఆలోచన. ఇక వైఎస్సార్‌సీపీ మాత్రం సార్వత్రిక ఎన్నికల విజయోత్సాహంతో స్థానిక పోరుకు సిద్థమవుతోంది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా క్లీన్‌ ఇమేజ్‌ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తోంది. మరోసారి ఆ పార్టీ జిల్లాలో విజయదుందుభి మోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదిఎమైనా జిల్లాలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు