లాక్‌డౌన్‌ వేళ.. ఆర్థిక అండ 

26 May, 2020 09:21 IST|Sakshi

అర్చకులు, పాస్టర్లు, మౌజమ్‌లకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం

నేడు వారి ఖాతాలకు నగదు జమచేయనున్న సీఎం

జిల్లా వ్యాప్తంగా 3,060 మందికి రూ.కోటి 53లక్షల సాయం

జయనగరం పూల్‌బాగ్‌: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు నిషేధించింది. భక్తులు రాకపోవడంతో అర్చకులు, మౌజమ్‌(ఇమామ్‌)లు, పాస్టర్లకు భృతి కరువైంది. వీరిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. జిల్లా వ్యాప్తంగా 3,060 మందికి రూ.5వేలు చొప్పున రూ.కోటీ53లక్షల ఆర్థిక సా యం మంగళవారం అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లాలో వివిధ దేవాలయాల్లో పూజలు చేసే 1616 మంది అర్చకులు, చర్చిల్లో ప్రార్థనలు జరిపే 1320 మంది పాస్టర్లు,62 మసీదుల్లో నమాజ్‌ చేయించే 124 మంది మౌజామ్,ఇమామ్‌లు లబ్ధిపొందనున్నారు. వీరి ఖాతాలకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నగదు జమచేయనున్నారు. ఆర్థిక సాయంపై లబ్ధిదారు ల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రత్యేక ఆర్థిక సాయం... 
లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పాస్టర్లను, మౌజామ్‌లు, ఇమామ్‌లను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. అందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.5వేలు సాయం అందించనుంది. జిల్లా వ్యాప్తంగా 1320 మంది పాస్టర్లు, 62 మంది మౌజామ్‌లు, 62 మంది ఇమామ్‌లు ఉన్నారు. వారందరికీ సాయం అందుతుంది. దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు ఎండోమెంట్‌ శాఖ ద్వారా సాయం అందనుంది. జిల్లావ్యాప్తంగా అందరికీ కలిపి రూ.కోటి  53 లక్షలు సాయం అందనుంది.
 – ఎం.అన్నపూర్ణమ్మ, మైనారిటీ సంక్షేమాధికారి, విజయనగరం

కష్టకాలంలో ఆదుకుంటున్నారు..  
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కష్టకాలంలో ఆదుకుంటున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇటువంటి సమ యంలో ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవడం శుభపరిణామం. రెండు నెలలుగా ఆలయాలకు భక్తులు రాకపోవడంతో భృతికరువైంది. అర్చకులకు అండగా నిలవడం అభినందనీయం.
– ఆకెళ్ల భాస్కరరావు, అర్చకులు, విజయనగరం

మరిన్ని వార్తలు