‘సాధ్యం కాదన్న ప్రతిపక్ష పార్టీకి చేసి చూపించారు’

17 Dec, 2019 19:11 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నగరంలోని వైఎస్సార్‌ పార్కులో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని కార్మికులు సంబరాలు చేసుకున్నారు. తమ కల సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఆయనకు అజన్మాంతం రుణపడి ఉంటామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతం రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారని కొనియాడారు. సీఎం నిర్ణయంతో ఆర్టీసీలో 53 వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. విలీనం సాధ్యం కాదన్న ప్రతిపక్ష పార్టీ నోటికి కళ్లెం వేసారని అభినందించారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు యావద్దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తున్నాయని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు