ముమ్మరంగా మాస్కుల తయారీ 

20 Apr, 2020 03:23 IST|Sakshi
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన మాస్కులతో సీఎం వైఎస్‌ జగన్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ తదితరులు

స్వయం సహాయక మహిళలకు తయారీ పనులు

మహిళలకు రోజుకు రూ.500కిపైనే ఆదాయం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచనతో మహిళలకు ఉపాధి 

విపత్తు వేళ ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం 

తొలుత రెడ్‌ జోన్‌లలోని ప్రజలకు మాస్కుల పంపిణీ  

మాస్కుల వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేసిన అధికారులు

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు విపత్తు కాలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధినిస్తోంది. కరోనా కట్టడికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కుల చొప్పున 16 కోట్ల మాస్కులను ప్రజలందరికీ  పంపిణీ చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్‌ వీటి తయారీ పనులను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ఆదేశించారు. దీనివల్ల విపత్కర పరిస్థితుల్లోనూ మహిళలు తమ కుటుంబాలను పోషించుకునే అవకాశం కలిగింది. 

మాస్కులను పరిశీలించిన సీఎం
స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన మాస్కులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం  తన నివాసంలో పరిశీలించారు. మెప్మా అధికారులు వీటిని సీఎంకు అందజేశారు. తొలుత రెడ్‌ జోన్లకు మాస్కులు పంపిణీ చేస్తున్నామని, త్వరలో మిగతా ప్రాంతాలకు కూడా అందచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ నవీన్‌కుమార్, అడిషనల్‌ డైరెక్టర్‌ శివపార్వతి పాల్గొన్నారు. 

► మాస్కుల తయారీని కాంట్రాక్టర్లకు కాకుండా నేరుగా స్వయం సహాయక సంఘాల్లోని అక్క చెల్లెమ్మలకు అప్పగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనికి అవసరమైన క్లాత్‌ను ఆప్కో నుంచి సేకరించాలని నిర్ణయించారు.  
► మొత్తం 16 కోట్ల మాస్కుల తయారీకి 1.50 కోట్ల మీటర్లకుపైగా క్లాత్‌ అవసరం కాగా ఇప్పటికే 20 లక్షలకు పైగా మీటర్ల క్లాత్‌ను ఆప్కో నుంచి సేకరించారు. మిగతా క్లాత్‌ త్వరలోనే అందనుంది.
► స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 40 వేల మంది దర్జీలను గుర్తించి యుద్ధప్రాతిపదికన మాస్కుల తయారీ చేపట్టారు.  
► ఒక్కో మాస్కు తయారీకి రూ.3.50 చొప్పున రోజుకు సుమారు రూ.500కిపైగా ప్రతి మహిళకూ ఆదాయం లభించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.  
► ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 7,28,201 మాస్కులు తయారు చేసి పంపిణీ కోసం తరలిస్తున్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో రోజుకు 30 లక్షల చొప్పున మాస్కుల తయారీకి సన్నద్ధమవుతున్నారు. మాస్కుల తయారీ, పంపిణీపై రియల్‌ టైం డేటాను ఆన్‌లైన్‌లో ఉంచారు

>
మరిన్ని వార్తలు