పదవ తరగతి పరీక్షల్లో సంస్కరణలు

13 Jul, 2019 07:27 IST|Sakshi

ఇంటర్నల్‌కు చెక్‌

ఇక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీ

ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు,ఉపాధ్యాయులు

పదోతరగతి పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కుల పేరిట జరుగుతున్న మాయాజాలానికి  నూతన ప్రభుత్వం చెక్‌ పెట్టింది. ప్రతిభ ఉన్న వారికే పట్టం కట్టాలని సంకల్పించింది. అందులో భాగంగానే పదోతరగతిలో ఉన్న ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వారిది ఉదారం..వీరికి భయం..
పది గ్రేడు పాయింట్లు సాధించడంలో ఇంటర్నల్‌ మార్కులు కీలకమైనందున ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలయాజమన్యాలు తమ విద్యార్థులకు ఉదారంగా 20కి 20 మార్కులు వేసేవారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఆవిధంగా చేయలేదు. వారి ప్రతిభ ఆధారంగా మార్కులు వేసేవారు. దీంతో ప్రభుత్వ విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చేవి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ అధికారుల తనిఖీలు, ఇతరత్రా సమస్యలతో ఇంటర్నల్‌ మార్కులు 18 కన్నా ఎక్కువ వేసేవారు కాదు. దీని ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు రాతపరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించినా ఇంటర్నల్‌ మార్కుల సాధనలో వెనుకబడటంతో 10 గ్రేడు పాయింట్లు సాధించలేకపోయేవారు.

సాక్షి, ఆరిలోవ(విశాఖ తూర్పు): పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్‌ మార్కులు విధానాన్ని రద్దు చేయడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ  ప్రకటించడంతో  హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉంటే మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్‌కు ఉండేవి. ఈ మార్కులు ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలలకు వరంగా మారాయి.  ఆయా పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం, 10 గ్రేడు పాయింట్లు సాధించడానికి  ఉపయోగపడేవి. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు ఇంటర్నల్‌ మార్కుల  తక్కువగా ఉండేవి. దీంతో ఇక్కడ  పది గ్రేడు పాయింట్లు కూడా తగ్గిపోయాయి. 

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు పోటాపోటీ
పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని రద్దు చేయడంతో ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల మధ్య పోటీ ఏర్పడుతుంది. ప్రతి విద్యార్థి తన ప్రతిభను  పరీక్షల్లోనే ప్రదర్శించాల్సి వస్తుంది. 100 మార్కులకు పరీక్ష రాసి ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వారే పది గ్రేడు పాయింట్లు సాధించగలరు. ఇప్పటివరకు ఇంటర్నల్‌ మార్కులు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎంత కష్టపడినా ఇంటర్నల్‌ మార్కులు  తక్కువగా వస్తాయనే బాధలో ఉండేవారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంటర్నల్స్‌తో ప్రభుత్వ పాఠశాలలకు నష్టమే
జిల్లాలో 2018–19 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థుల  ఉత్తీర్ణత శాతం, పది గ్రేడు పాయింట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య పరిశీలస్తే ఇంటర్నల్‌ మార్కులు ఏవిధంగా ప్రభావం చూపాయో తేటతెల్లమవుతుంది. 56,512 మంది పరీక్షలు రాయగా వారిలో 54,463 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత 96.37 శాతంగా నమోదైంది. వీరంతా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు. వారిలో 2421 మంది 10 గ్రాడ్‌ పాయింట్లు సాధించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 355 మందికి 10 గ్రేడు పాయింట్లు లభించాయి, మిగిలినవన్నీ ప్రైవేట్‌ పాఠ శాలల్లో చదివిన విద్యార్థులకు లభించాయి. ప్రభుత్వ పాఠశాలల నుంచి 32070 మంది విద్యార్థుల్లో 95 శాతం మంది ఉత్తీర్ణత కాగా ప్రైవేట్‌ పాఠశాలల్లో 98.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 

ఉత్తిత్తి నిబంధనలు
ఇంటర్నల్‌ మార్కులు ప్రవేశ పెట్టినప్పుడు విద్యాశాఖ పలు నిబంధనలు ప్రకటించింది. ఇంటర్నల్‌ మార్కులు వేయడంలో ప్రత్యేక తనిఖీలు చేస్తామంటూ ప్రకటనలు చేశారు. ప్రైవేట్‌ పాఠశాలల ఇంటర్నల్‌ మార్కులను ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పరిశీలిస్తారని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలు కాలేదు. కనీసం మండల విద్యాశాఖ అధికారులు కూడా ఎక్కడా తనిఖీలు నిర్వహించలేదు. దీంతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఇంటర్నల్‌ మార్కులు వేసుకొనేవారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 10 గ్రేడు పాయింట్లు రావడం తక్కువగా ఉన్నందున ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు, ప్రతిభా పారితోషకాలు పొందడంలో వెనుకబడ్డారు. ఈ ఏడాది నుంచి ఆ పరిస్థితి ఉండదు. రాత పరీక్షలో సత్తా చూపిన వారికే మంచి గ్రేడ్లు లభిస్తాయి. 

మరిన్ని వార్తలు