బీచ్‌ కోత నివారణకు రూ.7.5 కోట్లు 

4 May, 2020 10:51 IST|Sakshi

కళింగపట్నం బీచ్‌లో నదీ సంగమం వద్ద గ్రోయిన్ల నిర్మాణం 

కె.మత్స్యలేశం, బందరువానిపేటలకు తప్పనున్న ముప్పు 

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కృషి ఫలితం 

సాక్షి, గార: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కళింగపట్నం (కె.మత్స్యలేశం) బీచ్‌ వంశధార వరద వల్ల కోతకు గురవ్వకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.7.50 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు పరిపాలన ఆమోదం తెలిపింది. దీంతో వంశధార నది సముద్రంలో కలిసే సంగమం వద్ద మత్స్యలేశం గ్రామం వైపు గ్రోయిన్లు నిర్మించనున్నారు. దీనివల్ల వంÔశధార వరద సమయంలో కోత బెడదకు అడ్డుకట్ట పడనుంది. ప్రతి ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో వంశధారకు వరద వస్తుంది. వరద వచ్చినప్పుడు నది దిశ మార్చుకుంటూ కె.మత్స్యలేశం వైపు పయనిస్తుంది. ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా ఉన్న సుమారు వంద ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది.

ఇదే పరిస్ధితి కొనసాగితే కె.మత్స్యలేశం, బందరువానిపేట పంచాయతీలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. గతేడాది ఆగస్టు 9వ తేదీన వచ్చిన వరదతో బీచ్‌రోడ్డు కోతకు గురయ్యింది. పర్యాటకుల ఆహ్లాదం కోసం రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన జంతువుల బొమ్మలు, గ్రానైట్‌ బెంచీలు కొట్టుకుపోయాయి. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందారు. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పరిశీలించి శాశ్వత చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.     

రొయ్యల చెరువుల కోసం... నదీ తీరం ఆక్రమించేసి...  
వంశధార నది సంగమానికి సమీపంలో రెండు పాయలుగా ఉండి, సముద్రంలో కలిసే సరికి ఒకే నదిగా ఏర్పడుతుంది. నదికి ఆవలి వైపునున్న పోలాకి మండలం అంపలాం వద్ద భూమి ఆక్రమణకు గురయ్యింది. బడా వ్యాపారస్తులు ఇసుక దిబ్బలను రొయ్యల చెరువులుగా మార్చుకున్నారు. ఆ చెరువుల్లోకి వరద నీరు వెళ్లకుండా నదివైపు పెద్ద ఎత్తున గట్లు నిర్మించుకున్నారు. దీనివల్ల నీరు వేగం పెరిగి సముద్రంలో కలుస్తూ తీరాన్ని కబళించేసింది.

ఆక్రమణలను గత ప్రభుత్వం చూసీ చూడనట్టు వదిలేసింది. అధికారులు సర్వేలు చేసి నా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఎక్కడివక్కడ నిలిచిపోయినట్టు ఆరోపణలున్నాయి. పలుమార్లు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ప్రకటించడమే తప్ప ఆచరణలో అమలు కాలేదు. కోతకు గురయిన ప్రాంతం వద్ద గ్రోయిన్ల నిర్మాణానికి మార్గం సుగమం అవ్వడంతో రెండు పంచాయతీల ప్రజలు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  

ధర్మాన లేఖతో అత్యున్నత స్థ్ధాయి కమిటీ ఏర్పాటు
పర్యాటక ప్రదేశం కోతకు గురవ్వడంతోపాటు మత్స్యకారుల ఆందోళనపై ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాయడంతో ప్రభుత్వం అత్యున్నత స్ధాయి కమిటీ వేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్పటి చీఫ్‌ సెక్రటరీ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం నార్త్‌కోస్టు హైడ్రాలజీ విశ్రాంత ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ రౌతు సత్యనారాయణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ముగ్గురు నిపుణుల బృందం నదీ సంగమ స్ధలాలు కోతకు గురైన కారణాలను పరిశీలించింది. అంపలాం వద్ద రొయ్యల చెరువులు ఆక్ర మంగా నిర్మించారని నిర్ధారించి వాటిని తొలగించాలని సూచించారు. అధికారులు కొంతమేర తొలగించారు. ఇదిలావుండగా కొద్ది రోజుల క్రితం లోకాయుక్త నదిలో ఆక్రమణలను మే 15 కల్లా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.  

మరిన్ని వార్తలు