కొత్త పంచాయతీలకు లైన్‌క్లియర్‌ 

21 Nov, 2019 12:14 IST|Sakshi
పంచాయతీగా ఏర్పాటయ్యే అవకాశం ఉన్న గూనబద్ర ఆపోజిట్‌ కాలనీ

నిషేధం ఎత్తివేస్తూ సర్కార్‌ జీవో  

పాతికేళ్ల తర్వాత నెరవేరిన కల  

జిల్లాలో 60కి పైగా కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం  

సాక్షి , శ్రీకాకుళం: జిల్లాలో పంచాయతీల స్వరూపం మారనుంది. కొత్త పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. 24 ఏళ్లుగా కొత్త పంచాయతీల ఊసే లేదు. జిల్లాల నుంచి ప్రతిపాదనలు వెళ్లడమే తప్ప నిషేధం ఉన్న కారణంగా ఇంతవరకు వాటికి మోక్షం లభించలేదు. 1995 నుంచి అమల్లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ జీవో జారీ చేసింది. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా పెరగనుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 60కి పైగా కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం కనబడుతోంది.

సుదీర్ఘ నిరీక్షణకు తెర 
నియోజకవర్గాల పునర్విభజన జరిగింది.. మండల ప్రాదేశిక, వార్డుల వర్గీకరణలు జరిగాయి.. పంచాయతీల విలీనాలు చోటు చేసుకున్నాయి. కానీ పాతికేళ్లుగా కొత్త పంచాయతీల ఏర్పాటు జరగలేదు. 3 వేల జనాభా, 3 కిలోమీటర్ల దూరం, తలసరి ఆదాయం రూ.3 వేలు ఉన్న గ్రామాలు పంచాయతీగా అర్హత పొందుతాయి. కానీ నిషేధం కారణంగా కొత్త పంచాయతీల ఏర్పాటు కలగా మిగిలిపోయింది. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆసక్తి చూపలేదు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది జీవో నెంబర్‌ 167 జీవో జారీ చేశారు. ఫలితంగా కొత్త పంచాయతీల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్టయింది.  

ఇప్పటికే 13 ప్రతిపాదనలు.. కొత్తగా మరో 47..! 
3 వేల జనాభా, 3 వేల తలసరి ఆదాయం, 3 కిలోమీటర్ల మధ్య దూరం ఉన్న గ్రామాలు జిల్లాలో చాలా వరకు ఉన్నాయి. కాకపోతే స్థానికంగా విజ్ఞప్తులు వెళ్లాలి. అందులో భాగంగా ఇప్పటికే ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలుగా ఉన్న కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్‌ 1, మెట్టూరు బిట్‌ 2, మెట్టూరు బిట్‌ 3, కర్లెమ్మ, గూనభద్ర ఆపోజిట్‌ కాలనీ, ఎల్‌ఎన్‌ పేట మండలంలోని మోదుగుల వలస, శ్యాపలాపురం, టయాంబపురం, ఆమదాలవలస మండలంలోని గాజుల కొల్లివలస, వంగర మండలంలోని శ్రీహరిపురం, కింజంగి, హిరమండలం మండలంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్, సుబైల్‌ కాలనీలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. తాజాగా నిషేధం ఎత్తివేత జీవోతో వీటికి మోక్షం కలగనుంది. అలాగే నిబంధనల మేరకు మరో 47 వరకు కొత్త పంచాయతీల ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 1141 పంచాయతీలున్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా