ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు

30 Mar, 2020 11:58 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. నిరంతర వైద్య పర్యవేక్షణతో 65 ఏళ్ల వ్యక్తి వైరస్‌ బారినుంచి బయటపడ్డాడు. మదీనా వెళ్లొచ్చిన సదరు వ్యక్తి కరోనా వైరస్‌ లక్షణాలతో ఈ నెల 17న విశాఖలోని టీబీసీడీ ఆసుపత్రిలో చేరాడు. బీపీ, డయాబెటీస్‌ ఉన్నప్పటికి చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడింది. నిన్న(ఆదివారం), ఈ రోజు(సోమవారం) నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా నెగిటివ్‌ వచ్చింది. దీంతో వైద్యులు అతడ్ని డిశ్చార్జ్‌ చేశారు. 14 రోజులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. 

మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు
రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువకుడికి, రాజమండ్రికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య ఏపీలో 23కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహార్‌రెడ్డి తెలిపారు. సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఈ రోజు 33 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో  31 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. ఇప్పటివరకు 649 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 526 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చిందని, ఇంకా 100 మంది ఫలితాలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. మరో ఇద్దరు కరోనా పాజిటివ్ వ్యక్తుల ఆరోగ్యం మెరుగుపడిందని, చిత్తూరు - 1, తూర్పు గోదావరి - 3, గుంటూరు - 4, కృష్ణా - 4, కర్నూలు - 1, నెల్లూరు - 1, ప్రకాశం - 3, విశాఖ - 6 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు